వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగ
Publish Date:Aug 13, 2022
Advertisement
మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగపెట్టేసిందా? పార్టీ నుంచి బహిష్కరించకుండానే ఆయనను ఏకాకిని చేసేసిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే కాదు.. స్టార్ క్యాంపెయినర్ కూడా. అయినా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన సమయంలో మునుగోడులో కాంగ్రెస్ ప్రచార సారథ్యం వెంకటరెడ్డిదే అని ఒక ఊరడింపు మాట తప్ప... ఆ తరువాత జరిగిన ఏ విషయంలోనూ, ఏ వ్యవహారంలోనూ వెంకటరెడ్డికి ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. కనీసం సమావేశాలకు కూడా పిలవడం లేదు. మునుగోడు ప్రచార కర్తల జాబితాలో ఆయన పేరు కూడా లేదు. ఎన్నికల సమావేశాలకు పిలవడం అటుంచి కనీసం ప్రచారానికి రమ్మని కూడా అనడం లేదు. ర్యాలీలు, పాదయాత్రలలోనూ ఆయనను దూరంగానే పెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో ఉండి కూడా లేనట్టుగానే ఆయన పరిస్థితి ఉంది. కనీస అవగాహన ఉన్న ఎవరికైనా కాంగ్రెస్ ఆయనకు పొమ్మన లేక పొగపెడుతోందని ఇట్టే అర్ధమైపోతుంది. అలాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇంకా అర్ధం కాలేదని భావించలేం. కానీ ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నారు. ఉండి ఊరుకోవడం లేదు. టీపీసీసీ చీఫ్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వాటిని పార్టీ పట్టించుకోవడం లేదని తెలిసినా ఆయన తన ప్రయత్నం తాను మానడం లేదు. సోదరుడి గొంతుకకు వంత పాడుతున్నట్లు ఆయన తీరు ఉందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయన పార్టీలో ఉన్నా బీజేపీ గూటికి చేరిన ఆయన సోదరుడిలాగే కాంగ్రెస్ చూస్తోంది. దీంతో అనివార్యంగా ఎవరూ పిలవకపోయినా, ఎవరూ ఆహ్వానించకపోయినా... ఆ విషయాన్ని దాచి పెట్టి మునుగోడు ఉప ఎన్నికతో తనకు సంబంధం లేదనీ, తానక్కడకు ప్రచరానికి వెళ్లబోవడం లేదనీ గంభీరంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై అనుచిత విమర్శలు చేయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తనను విమర్శించిన వారినీ, విమర్శించేలా చేసిన వారిని వదిలిపెట్టనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాళ్ల విషయం రాష్ట్ర కాంగ్రెస్ తో కాదనీ, ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోనే తేల్చుకుంటాననీ చెబుతున్నారు. అయితే ఆయన మాటలను కాంగ్రెస్ వర్గీయులే ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీలో ఉండీ లేనట్టేనని, ఆయన తీరు పట్ల హైకమాండ్ కూడా విసిగిపోయిందనీ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ కాదుకదా, కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి అప్పాయింట్ మెంట్ దొరకడం కూడా కష్టమేనంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ ఎప్పుడో పరిగణనలోనికి తీసుకోవడం మానేసిందని అంటున్నారు. పార్టీ నుంచి కోమటిరెడ్డిని ప్రత్యేకంగా బహిష్కరించడం అంటూ ఉండదనీ, కానీ ఆయనకు కనీస గుర్తింపు కూడా లేని చోట ఉండలేని పరిస్థితి కల్పించడమే పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నీ తెలిసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని అడ్డు పెట్టుకుని ఉండటానికి కారణం.. పార్టీలో ఉంటూనే తన సోదరుడికి సాధ్యమైనంత మేలు చేసి ఆ తరువాత కమలం గూటికి చేరాలన్న వ్యూహమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/congress-ignors-komatireddy-venkatareddy-25-141841.html





