28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన
Publish Date:Apr 7, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మరియు సాంకేతిక రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి విశాఖపట్నం వేదిక కాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్, ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన భారీ డేటా సెంటర్ కు నెల 28 భూమి పూజ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది. ప్రస్తుతం తర్లువాడలోని సర్వే నంబర్ 1 పరిధిలోని భూముల్లో నిర్మాణానికి వీలుగా జంగల్ క్లియరెన్స్, భూమిని చదును చేసే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న జరిగే ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.ఈ డేటా సెంటర్ కేవలం భవనాల నిర్మాణానికే పరిమితం కాకుండా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన 1 గిగావాట్ సామర్థ్యంతో పని చేయనుంది. అదానీ ఇన్‌ఫ్రా, ఎయిర్‌టెల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో గూగుల్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. దీని ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతే కాకుండా విశాఖ అంతర్జాతీయ డిజిటల్ మ్యాప్‌లో కీలక కేంద్రంగా మారనుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ వేదికగా జరిగిన ఒప్పందం తర్వాత, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పనులు పట్టాలెక్కడం గమనార్హం. ఈ సెంటర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఏపీని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యంలో ఈ గూగుల్ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుంది.
http://www.teluguone.com/news/content/groundbreaking-ceremony-for-google-data-center-in-visakhapatnam-on-the-28th-36-216823.html





