జై జగన్ అన్న అంకారావుకి సలహాదారు పదవా?
Publish Date:Jun 17, 2025

Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంకారావు అనే వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సన్మానం కోసం పిలిపించిన ఆయనను.. ఏకంగా సలహాదారుగా తీసుకుంటున్నట్టు అక్కడికక్కడే ప్రకటించి సీఎం చంద్రబాబు ఓ సంచలనమే రేపారు. నల్లమల అడవులను కాపాడేందుకు శ్రమిస్తున్న వారిలో అంకారావు ఒకరు అనే గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆయన చాలా ఏళ్లుగా పర్యావరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై కొందరు కూటమి నేతలు మాత్రం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంకారావు వైసీపీ నేత అని.. ఆ పార్టీకే సపోర్ట్ చేశారంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు నాడు జై జగన్ అనలేదని వైసీపీ నేతలు తోట చంద్రయ్య గొంతుకోశారని.. కానీ నేడు నేడు జై జగన్ అన్న అంకారావుకి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టిందంటూ పెదవి విరుస్తున్నారు పల్నాడు జిల్లా టీడీపీ నేతలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం చేస్తూ.. పక్క పార్టీ వారికి కీలక సలహాదారుడు పదవి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా అంకారావు కేక్ కట్ చేశారనీ, ఈ విషయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అంకారావు నరసరావుపేట పార్లమెంట్ వైసిపి బీసీ సెల్ అధ్యక్షుడుగా 2018లో నియమితులయ్యారని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో అంబటి రాంబాబు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని.. అతని చేతుల మీదుగానే ఆయన నియామక పత్రాలు పొందారంటున్నారు. అంకారావు ఇప్పుడు కూడా వైసీపీలోనే ఉన్నారని.. కనీసం రాజీనామా కూడా చేయలేదని చెబతున్నారు. అంకారావుకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. కూటమి నేతలు తెలిసీ తెలియక చిన్న తప్పులు చేస్తేనే.. పార్టీ నుండి సస్పెండ్ చేసే అధినేతలు.. ఇలాంటి విషయాల్లో నియోజకవర్గ నాయకుల ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యావరణ శాఖ సలహాదారుడు జై జగన్ అంటున్న వీడియో టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాకైనా.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/government-advisor-post-to-ankarao-39-200134.html












