టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విజయం
Publish Date:Nov 5, 2015
Advertisement
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ప్రతిపక్ష పార్టీల మీద ప్రభుత్వ ఆధిక్యమే ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి అనేక సందర్భాలలో న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు అయితే పడ్డాయిగానీ, ప్రతిపక్షాల నుంచి చెప్పకోదగ్గ ప్రతిఘటన ఎదురు కాలేదు. ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వ ధాటికి నిలబడలేక గందరగోళంలో పడిపోయాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విజయం సాధించే విషయం అటుంచితే, అసలు ప్రతిపక్షాల ఉనికికే టీఆర్ఎస్ పార్టీ గండి కొట్టే ప్రయత్నాలు చేసింది. ‘ఆపరేషన్ ఆకర్ష’ ద్వారా ప్రతిపక్షాలకు అధికార పార్టీ చెక్ పెట్టింది. ఈ ‘ఆపరేషన్ ఆకర్ష’ నుంచి తప్పించుకోవడానికే వీలు కాక ప్రతిపక్షాలు అల్లాడిపోయాయి. ఇక ప్రభుత్వం మీద విజయం సాధించడం కూడానా!
అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవు... భూమి గుండ్రంగా వుందనే సామెత వుండనే వుంది. ఇంతకాలం ప్రభుత్వం ధాటికి బెంబేలెత్తిపోయిన ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రభుత్వం మీద విజయం సాధించాయి. కలసికట్టుగా పనిచేసి చాలా కాలం తర్వాత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఉమ్మడిగా పోరాటం చేశాయి. ప్రతిపక్షాల పోరాట ఫలితంగా కేంద్ర ఎన్నికల సంఘం కదిలింది. హైదరాబాద్‌కి బృందాన్ని పంపి పరిస్థితిని గమనించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పునఃపరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించాలని ఈసీ ఆదేశించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రతిపక్షాల పోరాటం వల్లనే సాధ్యమైంది. మొత్తానికి చాలాకాలం తర్వాత ప్రభుత్వం మీద ఒక విజయం సాధించిన తెలంగాణ ప్రతిపక్షాలకు అభినందనలు.
http://www.teluguone.com/news/content/ghmc-elections-45-52050.html





