ఆ సీట్లను కూడా వదలరా....వంశీ ఎన్నిక మీద పిటీషన్
Publish Date:Jul 9, 2019
Advertisement
ఏపీలో తెలుగుదేశానికి వచ్చిన 23 సీట్ల మీద కూడా వైసీపీ కన్నేసినట్టుంది. అందుకే టీడీపీ గెలుచుకున్న 23 సీట్లలో ఎమ్మెల్యేల మీద ఏమేం లీగల్ లొసుగులు ఉన్నాయో అవన్నీ తోడే పనిలో పడ్డారు వైసీపీ ఓడిన అభ్యర్ధులు. అందుకే ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ వారి మీద వైసీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి వ్యాజ్యం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ గన్నవరం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి వై.వెంకటరావు హైకోర్టులో మంగళవారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఆయన లాజిక్ ఏంటంటే వంశీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను ఉల్లంఘించారనట. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి వంశీ అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే వంశీ సూచన మేరకు ఆయన అనుచరులు పాత తహశీల్దార్ సంతకంతో ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారని అయితే అవి నకిలీవని తెలిసి కొందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వెంకటరావు తన పిటిషన్ లో పొందుపరిచారు. అలాగే పోస్టల్ బ్యాలెట్లను మరోసారి లెక్కించేలా ఆదేశించాలని ఆయన పిటిషన్ లో కోరారు. మరోవైపు, నలుగురు పిల్లలున్నా, ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం తనకు ముగ్గురే ఉన్నట్లు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తప్పుడు వివరాలను పొందుపరిచారని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కూడా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
http://www.teluguone.com/news/content/gannavaram-ycp-candidate-seeking-high-court-against-vallabhaneni-vamsi-39-87925.html





