బాబుకు షాక్...బీజేపీలోకి సీనియర్ నేత
Publish Date:Jul 9, 2019
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. మరోపక్క బీజేపీ నేతల వ్యూహాత్మక ప్రకటనల నేపధ్యంలో బాబుకు వీర విధేయులు అని పేరు పడిన వారు కూడా బీజేపీకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, బాబుకు వీర విధేయుడు, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడతూ పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. అయితే త్వరలోనే బీజేపీలో చేరతారని ఆయన సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది. గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా పేరొందిన సాంబశివరావు ఉన్నత విద్యను అభ్యసించి నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించారు. నాసా శాస్త్రవేత్తగా ఉన్న ఆయన్ని 2004 ఎన్నికల్లో తెదేపా అధిష్ఠానం దుగ్గిరాల నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో సాంబశివరావు పరాజయంపాలైనా దుగ్గిరాల నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, నగర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. తెదేపా నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గత ప్రభుత్వం సాంబశివరావును రియల్ ఎస్టేట్ డవలప్‌మెంట్ అథారిటీ రెరా డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ఈ పదవిలో ఉన్నందున పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా తెర వెనుక సేవలందించారు. పార్టీకి చేసిన సేవలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల తెదేపాను వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈనెల 14న గుంటూరులో జరిగే భాజపా సమావేశంలో సీనియర్ నేతల సమక్షంలో చేరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా, రెరా డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
http://www.teluguone.com/news/content/-tdp-senior-leader-chandu-sambasiva-rao-likely-to-join-in-bjp-39-87926.html





