మహిళపై గ్యాంగ్ రే*ప్, మర్డర్.. జగనన్న రాజ్యంలో మరో దారుణం..
Publish Date:Apr 28, 2022
Advertisement
ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వరుస ఘటనలు జగన్ సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. దిశ చట్టం, దిశ యాప్ అంటూ ఎన్ని కబుర్లు చెప్పినా.. వాస్తవంలో మహిళలపై దారుణాలు, ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన అంత సంచలనం సృష్టించగా.. తాజాగా గుంటూరులో ఓ ఇల్లాలిపై సామూహిక అత్యా-చారం, హత్య జరగడం మరింత కలకలం రేపుతోంది. దోషులకు సత్వరమే కఠిన శిక్షలు పడకపోవడం వల్లే.. నేరస్థుల్లో భయం లేకుండా పోతోందనే విమర్శ ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, తుమ్మపూడికి చెందిన తిరుపతమ్మను సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆమె భర్త.. కాంట్రాక్ట్ పనుల మీద నెలల తరబడి బయటి ప్రాంతాల్లో ఉంటుంటాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. తిరుపతమ్మ మాత్రం ఊళ్లేనే ఉంటూ నీటి పైపులు అద్దెకిచ్చేది. అలాంటిది.. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో చనిపోయి ఉండడాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృత దేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఒంటిపై దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురిపై అనుమానం ఉన్నట్లు మృతురాలి భర్త ఆరోపించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఒక్కరికైనా శిక్ష పడుంటే భయం పుట్టేదన్నారు. జగన్ పాలనలో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారని విమర్శించారు నారా లోకేశ్.
http://www.teluguone.com/news/content/gang-rap-and-murder-in-guntur-39-135111.html





