మెట్రో ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఆరోపణలు నిరాధారం : కిషన్ రెడ్డి
Publish Date:Jun 16, 2026
Advertisement
మెట్రో ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం తాను ఎప్పుడూ చేయలేదని, గత ఏడేళ్లుగా కేంద్ర సహాయ మంత్రి, కేబినెట్ మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశానని తెలిపారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో సహకరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన వెల్లడించారు. మెట్రో ఫేజ్-1కు కేంద్రం రూ.1,250 కోట్లు అందించిందని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, కాంగ్రెస్ లేదా ముఖ్యమంత్రి నుంచి తమకు ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందన్నారు. తాను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకున్నానన్న సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ కట్టుబడి ఉన్నానన్నారు. తెలంగాణలో రూ.1.75 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం చేపట్టిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సహకరించకపోయినా MMTS ఫేజ్-2 పూర్తి చేశామని, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం మెట్రో అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించిన కిషన్ రెడ్డి, కేంద్రం ఇటీవల రాష్ట్రానికి రూ.11 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, మూసీ పునరుజ్జీవనానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రూ.4,100 కోట్ల రుణం అందించిందని చెప్పారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్షియల్, టెక్నికల్ అంశాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, విమర్శలతో సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించిన కిషన్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం కొనసాగిస్తుందని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తే తాను కూడా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
మెట్రో ఫేజ్-2కు సంబంధించి జనవరి 15న సీఎంకు లేఖ రాశానని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని పలుమార్లు సూచించానని వెల్లడించారు. IRFC రుణాల విషయంలో తాను ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఆర్థిక, సాంకేతిక అంశాలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి పరిష్కారం కనుగొనాలని సూచించారు. ప్రాజెక్టులను అడ్డుకునే సంస్కృతి బీజేపీలో లేదని, అవసరమైతే మార్పులు సూచిస్తామని కానీ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోమని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/g-kishan-reddy-36-223163.html





