అవకాశాలకు నెలవు అమరావతి...సరికొత్త ఆలోచనలతో రావాలి : సీఎం చంద్రబాబు
Publish Date:Jun 16, 2026
Advertisement
సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి ప్రసంగం.. అంతర్జాతీయ మౌలిక వసతులతో నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సరికొత్త ఆలోచనలతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సింగపూర్‌లో రెండవ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లీడర్ షిప్ ప్లీనరీ-2లో పాల్గొని ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశపై ప్రసంగించారు. అమరావతిని నాలెడ్జ్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని... జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు వస్తున్నాయని సీఎం చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి అమరావతికి ప్రత్యేకత తీసుకువస్తాయని వివరించారు. అమరావతిని ప్రజా రాజధానిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మితమవుతోందని స్పష్టం చేశారు. ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందన్నారు. 21 కి.మీ. కృష్ణానది పొడవునా వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని..., అలాగే ఇన్నర్ - ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా నిలుస్తుందని చెప్పారు. స్పోర్ట్స్, ఫైనాన్సియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి థీమ్ లతో అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ఒకే ఒక్క పిలుపుతో రాజధాని నిర్మాణం కోసం రైతులు 35 వేల ఎకరాలను అప్పగిస్తే... వాటిని అభివృద్ధి చేసి కొంత భాగాన్ని రైతులకు తిరిగి ప్లాట్లుగా ఇచ్చామని వివరించారు. 25 ఏళ్ల క్రితం తాను ఐటీ గురించి మాట్లాడానని... ఐటీ భవిష్యత్‌ను ఆరోజే ఊహించి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవడంతో... ఇవాళ తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో అందరికన్నా ముందున్నారని సీఎం అన్నారు. ఇప్పుడు ఏఐ గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. నాడు తాను నిర్మించిన సైబరాబాద్... నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. సైబరాబాద్‌లో నాడు ఎకరం రూ.2 లక్షలు ఉంటే... నేడు ఎకరం రూ.200 కోట్లకు పెరిగిందన్నారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుందని చెప్పేందుకు సైబరాబాద్ నిదర్శనమని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో మరోసారి కొత్త నగరాన్ని నిర్మించే అవకాశం తనకు లభించిందన్నారు. ప్రసంగం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సింగపూర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించారు. సింగపూర్ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పట్టణాభివృద్ధి నమూనాలను సీఎం ఆసక్తిగా తిలకించారు. ఇన్నోవేటర్స్ అలేలో స్టార్టప్‌ల ఆవిష్కరణలను, గూగుల్ స్టాల్‌ను పరిశీలించారు. టెక్నాలజీ ఆధారిత పాలనలో సింగపూర్ అనుభవాలను తెలుసుకున్నారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-naidu-36-223166.html





