ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. నాంపల్లి కోర్టుకు కేటీఆర్ గైర్హాజరు..!
Publish Date:Aug 25, 2026
Advertisement
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అయితే మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లు కేటీఆర్ తరఫు న్యాయవా దులు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 18కు వాయిదా వేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల చెల్లింపుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో కేటీఆర్, అరవింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ 2026 మార్చిలో 77 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు సుమారు రూ.54.88 కోట్ల చెల్లింపుల వ్యవహారాన్ని ఏసీబీ ప్రధానంగా ప్రస్తావించింది. గత జూలై 31న చార్జిషీట్ అనంతరం తొలిసారి నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్, అరవింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించారు. అనంతరం కేసును ఆగస్టు 25కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. అయితే కేటీఆర్ వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు తదుపరి విచారణ వచ్చేనెల 18వ తారీకు వాయిదా వేసింది. ప్రభుత్వ నిధుల చెల్లింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్నది ఏసీబీ ఆరోపణ కాగా, ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా, ఆటోమొబైల్ హబ్‌గా నిలబెట్టే ఉద్దేశంతో నిర్వహించామని కేటీఆర్ వర్గం ఆరోపణలను ఖండిస్తోంది. కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై సెప్టెంబర్ 18న స్పష్టత రానుంది. Formula E car race case, KTR, Nampally Court, Arvind Kumar, Engineer BLN Reddy, HMDA, ACB Case, KCR, BRS Party
http://www.teluguone.com/news/content/formula-e-car-race-case-36-229827.html





