ఆయన అమెరికాని... 638సార్లు ఓడించాడు!
Publish Date:Nov 26, 2016
Advertisement
ఫిడెల్ క్యాస్ట్రో .... క్యూబా అనే ఒక చిన్న దేశానికి యాభై ఏళ్ల పైచిలుకు సారధ్యం వహించిన ఒక 90ఏళ్ల వృద్ధుడు! ఆయన సహజ కారణాలతో చనిపోతే ప్రపంచం అంతా చర్చించుకోవాల్సిన అవసరం ఏం వుంది? మామూలుగా అయితే ఏం లేదు! కాని, క్యాస్ట్రో ఎదురించింది అమెరికాని! అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని! అదీ 638సార్లు సీఐఏ చేసిన హత్యా ప్రయత్నాల్ని తట్టుకుని, తిప్పికొట్టి ప్రాణాలతో నిలబడగలిగాడు! తన దేశాన్ని అమెరికన్ క్యాపిటలిస్టు మర్రి చెట్టు నీడలో కూడా సజీవంగా నిలపగలిగాడు.... అందు కోసం పిడెల్ గురించి మాట్లాడుకుంటోంది ప్రంపంచం!
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అమెరికా తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం రాజేయగలదు! దేశాలకు దేశాల్నే కుప్పగూల్చేయగలదు. సిరియా, లిబియా... ఇలా బోలెడు ఉదాహరణలు! కాని, అమెరికన్ మైటీ పవర్ ని తట్టుకుని నిలిచిన దేశాలు కూడా వున్నాయి. తమ అంతర్గత వ్యవహారాల్లో అగ్రరాజ్యాన్ని కనీసం చిటికెన వేలు కూడా పెట్టనీయని అలాంటి అతి కొద్దీ దేశాలే వియత్నాం, క్యూబా లాంటివి!
అమెరికా దేశపు నీడలోనే కరేబియన్ దీవుల్లో ఒకటిగా వుంది క్యూబా. దానికి అమెరికన్ పీడ నుంచి విముక్తి కలిగించిన వాడు ఫిడెల్ క్యాస్ట్రో. కమ్యూనిజం, సోషలిజం నమ్ముకున్న ఆయన టీనేజ్ లోనే గన్ను పట్టుకుని విప్లవంలోకి దూకాడు. అమెరికా తొత్తుగా దేశాన్ని పాలిస్తోన్న మిలటరీ నియంత నుంచి స్వేచ్ఛ సాధించాడు. తరువాత 33ఏళ్ల వయస్సులోనే క్యూబా దేశ పగ్గాలు చేపట్టాడు. అమెరికా ఎన్ని కుట్రలు చేసినా సామ్యవాద పంథాలో దేశాన్ని ముందుకు నడిపాడు! ఈ సమయంలోనే ఆయన అర శతాబ్దాపు పాలనలో సీఐఏ క్యాస్ట్రోను వేసేయటానికి ప్రయత్నించని రోజు లేదు! అలా 638సార్లు విఫలయత్నాలు చేసిందట... బహుశా అమెరికాకు ఇంతకంటే దారుణమైన పరాభవం మరొకటి చరిత్రలో ఏదీ లేదనుకుంటా!
విషపూరితమైన మాత్రలు ఇవ్వడం, ఆయన కాల్చే చుట్టలో బాంబు అమర్చడం , స్కూబా డైవింగ్ సూట్‌లో డేంజరస్ ఫంగస్‌ను ఉంచడం, విషం నింపిన సిగరెట్లు వంటి ప్రయోగాలతో అంతమొందించేందుకు ప్రయత్నించినా కాస్ట్రో ఖతమ్ కాలేదట! మాఫియా స్టైల్లో కాల్చి చంపేందుకు కూడా సీఐఏ ప్రయత్నం చేసింది కానీ అది వర్కవుట్ కాలేదు! చివరికి క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లోరెంజ్ ద్వారా సైతం ఆయన్ను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ నిత్యం అలెర్ట్ గా ఉండే ఫిడెల్ కాస్ట్రో... అమెరికా కుట్రలన్నీ ధిక్కరించి నిర్భయంగా తిరిగాడు. దేశ బాధ్యతలు తమ్ముడికి అప్పజెప్పే వరకూ క్యూబాను అమెరికాకు పక్కలో బల్లెంలా పదునుగా ముందుకు నడిపాడు....
http://www.teluguone.com/news/content/fidel-castro-37-69535.html





