దేశంలో తగ్గుతున్న జనాభా.. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు స్థానాలకు ఎసరు!
Publish Date:Jun 18, 2022
Advertisement
గంపెడు పిల్లల్ని కని సుఖ సంతోషాలతో జీవించండి అనే పాత కాలం రోజులు పోయాయి. ఒకరిద్దురు పిల్లలతో ఆనందంగా జీవించండి, ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండండి అంటూ పెద్దలు తమ పిల్లల్ని దీవించే కాలం వచ్చేసింది. అలాగే యువతలో కూడా కుటుంబ భవిష్యత్, ఆర్థిక పురోగతి వంటి విషయాలలో స్పష్టతతో ముందుకు అడుగు వేస్తున్నారు. ఈ కారణంగా దేశంలో జనాభా పెరుగుదల నియంత్రణలోకి వచ్చింది. అయితే ఇది ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలోనే ఒకింత ఎక్కువగా ఉంది. ఇక దేశంలో ఉత్తరాది ఆధిపత్యం అధికం, దక్షిణాది పట్ల చిన్న చూపు అన్న భావన దక్షిణాది వారిలో చాలా కాలం నుంచీ ఉంది. జాతీయ భాష అంటూ హిందీని నెత్తిన రుద్దుతున్నారనీ, హిందీ రాని వారిని అంటే ముఖ్యంగా దక్షిణాది వారిని దేశంలో రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారని దక్షిణాది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొదటి నుంచీ ఉంది. జనాభా నియంత్రణ దేశ ప్రగతిని అత్యంత కీలకమంటూ గతంలో కేంద్రం విస్తృతంగా ప్రచారం చేసింది. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాలలోనే కుటుంబ నియంత్రణ ప్రచారానికి ఉత్తరాదితో పోలిస్తే ఎక్కువ స్పందన కనిపించింది. అదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ రాజకీయాలలో ప్రాతినిథ్యం తగ్గిపోయే ముప్పును తెచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2026లో నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే లోక్ సభలో దక్షిణాది ప్రాతినిథ్యం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన 2026లో జరగాల్సి ఉంది. అలా జరిగితే దక్షిణాది నుంచి లోక్ సభ స్థానాలు తగ్గిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో ఉత్తరాదిలో లోక్ సభ స్థానాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 2026లోజనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన జరిగితే.. ఐదు దక్షిణాది రాష్ట్ర్రాలలో కలిపి 26లోక్ సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలలో 31 స్థానాలు పెరుగుతాయి. ప్రపంచంలోనే జనాభా వేగంగా పెరుగుతున్న దేశంగా ఇంత కాలం అందరూ చెబుతూ వచ్చారు. అనతి కాలంలోనే జనాభా విషయంలో భారత్ చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందనీ అంచనాలు వేశారు. కానీ వాస్తవంగా భారత్ లో జనాభా తగ్గుతూ వస్తోంది. అది కూడా పూర్తిగా అన్ ప్రపోర్షనేట్ గా ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమం అంటే అమలు చేసిన పథకాలు దేశంలో జనాభా నియంత్రణ విషయంలో ప్రజలలో ఏదో ఒక మేరకు చైతన్యం తీసుకురావడమే. ఉత్తరాదితో పోలిస్తే ఈ చైతన్యం దక్షిణాదిలో ఎక్కువగా వచ్చింది. దీంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో జనాభా నియంత్రణ విజయవంతంగా అమలైంది. అయితే కేంద్రం మాత్రం అన్ని గ్రాంటులు, నిధులు, కార్యక్రమాలను జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయించడంతో కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు సందర్భాలలో కేంద్రానికి నిరసన రూపంలో తెలియజేశారు. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి.. నిధుల్లో కేతేమిటని కూడా వారు పలు సందర్భాలలో నిలదీశారు. అదలా ఉంచితే.. ఇప్పుడు జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే లోక్ సభ సీట్ల స్వరూపం పూర్తిగా మారుతుంది. ఉత్తరప్రదేశ్ , బీహార్, మధ్యప్రదేశ్ ,మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు సీట్లు బాగా పెరుగుతాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ , ఒడిశా,తెలంగాణ సీట్లు తగ్గుతాయి. 1971లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో లోక్ సభ నియోజకవర్గాని కి ఓటర్లు 10 లక్షల నుంచి 10.6 లక్షల వరకు ఉన్నారు. ఈ 40 ఏళ్లలో సీట్ల సంఖ్య మారలేదుగానీ ఓటర్లు పెరిగారు. 2016 జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే రాజస్థాన్ లో ఒక్కో ఎంపీ 30 లక్షల మందికి ప్రాతినిధ్యం హిస్తున్నాడు. అదే తమిళనాడులో ఇది 18 లక్షలు మాత్రమే. జాతీయు కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోయింది. ఆ సర్వే ప్రకారం 2015-16లో 2.2గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2019-21 నాటికి 2.0కు పడిపోయింది. పునఃస్థాపన స్థాయి సంతానోత్పత్తి అనేది జనాభా ఒక తరం నుండి మరొక తరానికి సరిగ్గా భర్తీ చేసే స్థాయిని సూచిస్తుంది, తద్వారా స్థాయి తగినంత కాలం పాటు కొనసాగితే సున్నా జనాభా పెరుగుదలకు దారి తీస్తుంది. 1992-93, 2019-21 మధ్య కాలంలో దేశంలో టోటల్ ఫెర్టలిటీ రేటు 3.4 నుంచి 2కు పడపోయింది. ఈ విధంగా టిఎఫ్ ఆర్ పడిపోవడమన్నది పట్టణాలలో 1992-93లో 2.7 వుండగా అది 2019-21లో అది 1.6కి పడిపోయింది. అయితే ప్రజలు నివసించే ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సంతానోత్సత్తి రేటు 20-24 మధ్య వయస్కులలో అధికంగా ఉంటుందనీ, ఆ తరువాత వయస్సు పెరిగే కొద్దీ క్రమంగా తగ్గిపోతుందని ఎన్ ఎఫ్ హెచ్ సర్వేలన్నీ తేల్చాయి. మహిళల్లో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి అనేక కారణాల్లో అ విద్య కూడా ఒకటి. ప్రాధమిక పాఠశాల చదువు లేని మహిళల కంటే చదువుకున్న వారి సంతానోత్పత్తి రేటు తక్కువగా వుందని తేలింది. చదువు లేని మహిళల్లో టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.8 వుండగా, చదువుకున్న మహిళ ల్లో అది 1.8 గా వుంది. దేశంలో మతాల వారీగా చూస్తే, హిందూ మహిళల్లో టిఎఫ్ ఆర్ 1.94, ముస్లిం మహిళల్లో 2.2, క్రిస్టియన్ మహిళల్లో 1.88, బౌద్ధుల్లో 1.39గా వుంది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 1992-93లో 3.7 వుండగా అది 2019-21 కి 2.1 కి చేరుకుంది. ప్రస్తుతం భారత్ జనాభా సుమారు 140 కోట్లు వుంది. ఇది 2100 నాటికి 109 కోట్లు తగ్గే అవకాశం వుంది సర్వే పేర్కొంది ఇందుకు సంతానోత్పత్తి రేటు పడిపోవమే ప్రధాన కారణంగా నివేదికలు స్పష్టం చేశాయి. భారతదేశంలో స్త్రీల విద్య వ్యాప్తి చెందడంతో గర్భనిరోధక పద్ధతులు పెరుగుతాయని భావిస్తున్నారు. 2021లో భారత్‌లో సంతానోత్పత్తి 2.38 శాతం వుండగా 2100 నాటికి 1.6 శాతానికి పడిపోవచ్చు! 2030 నాటికి ప్రపంచం మొత్తం మీద వాతవరణంలో పెను మార్పులు సంభవిస్తాయని, ప్రజలు అస్సలు తట్టుకోలేని వేడిమి వుంటుందని, స్వచ్ఛమయిన నీరు లభించక ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేగాక క్రమేపీ ప్రజల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందనీ అన్నారు. ఫలితంగా ప్రజలు జబ్బుల బారిన పడి నానా ఇబ్బందులూ ఎదుర్కొంటారు. 1960లో భారత మహిళలు తమ జీవితకాలంలో కనీసం ఆరుగురు పిల్లల్ని కనగలిగే సామర్థ్యంతో ఉండేవారు. 2005 నాటికి ఇది ముగ్గురు పిల్లలకు పరిమితమైపోయింది. ఇదే ట్రెండ్ కొనసాగితే జాతీయ రాజకీయాలలో దక్షిణాది ప్రాతినిథ్యం నామామాత్రపు స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు ప్రాంతీయ ప్రాతినిథ్యానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా జనాభా పెరుగుదల రేటు మందగించినప్పటికీ.. అది దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.
http://www.teluguone.com/news/content/fertility-rate-decline-in-india-south-to-loose-parliament-seats-25-137956.html





