వరకట్నం వెనక్కి ఇప్పించిన కోర్టు.. వరుడి కుటుంబీకులు బహుపరాక్!
Publish Date:Jun 19, 2022
Advertisement
మంచి సంబంధం చూసి పిల్లలకు పెళ్లి చేయడం, రెండు కుటుంబాలు స్నేహపూర్వకంగా వుండడం అనేది అందరం కోరుకుంటాం. కానీ అనేకానేక కారణాల వల్ల పోనీ దురదృష్టవశాత్తూ విడాకుల వరకూ వస్తే విడిపోవడమే మంచిదనుకుంటున్నారు రెండు కుటుంబాల వారూ. చదువు, మంచి వుద్యోగం, ఆర్ధికంగా నిలదొక్కుకున్నప్పటికీ ఏదో కారణంగా విడిపోయే పరిస్థితులు వస్తే అప్పుడు సాధ్యమయినంతవరకూ రెండు కుటుంబాలూ ఆ విపత్తు నుంచి బయటపడాలనే అనుకుంటాయి. మొన్నటివరకూ అయితే ఇలా తప్పని స్థితిలో విడిపోవడం సజావుగానే జరిగిపోయింది. విడిపోయినపుడు స్నేహపూర్వకంగానే విడిపోయిన కుటుంబాలూ వున్నాయి. అయితే తీసుకున్న వరకట్నం డిమాండ్ చేయడమన్నది ఎప్పూడూ ఎవ్వరూ చేసిన దాఖలాలు లేవు. కానీ చిత్రంగా మొన్నీమధ్యనే బెంగుళూరుకి చెందిన మహిళ వరకట్నంగా ఇచ్చిన సొమ్ముతో పాటు బంగారు ఆభరణాలు డిమాండ్ చేసి కోర్టు ద్వారా పొందింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్బాయి కుటుంబంవారు పెళ్లి సమయంలో తీసుకున్న 9 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు కూడా తిరిగి ఇచ్చేయాలని తీర్పు నిచ్చింది. విషయమేమంటే ముంబైకి చెందిన ఓ అబ్బాయి 1998లో బెంగుళూరుకి చెందిన అమ్మాయిని పెళ్లాడాడు. 2001 లో ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో అదే ఏడాది సెప్టెంబర్ 10 ఇద్దరూ విడాకుల కోసం ముంబై హైకోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు భార్యకు 4 లక్షలు జీవభృతిగా ఇవ్వాలని ముంబై కోర్టు ఆదేశించింది. వరకట్నం డబ్బు, పెట్టిన బంగారం కూడా వెనక్కి ఇవ్వమని అమ్మాయి వాళ్లు అడిగితే అబ్బాయి కుటుంబం వారు తిరస్కరించేరు. దీంతో అమ్మాయి కుటుంబంవారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం. నాగప్రసన్న ఏకసభ్య ధర్మాసనం కేసు పూర్వా పరాలు విన్న తర్వాత అబ్బాయి కుటుంబం వరకట్నం డబ్బుతో పాటు పెట్టిన బంగారు ఆభరణాలు తిరిగి అమ్మాయి కుటుం బానికి ఇచ్చేయాల్సిందే అని తీర్పునిచ్చింది. మరంచేత ఇక మగ పెళ్లివారు చాలా జాగ్రత్త పడాల్సి వుంటుదేమో! పిల్లడు పిల్లతో కడు జాగ్రత్తగా మసలు కోవాలి. ఏమాత్రం విభే దించినా, కొట్టడాలు, తిట్టడాలు అతిగా చేసినా కేసు అయి కోర్టుదాకా వెళితే ఇచ్చినదంతా కక్కాల్సి వస్తుంది. బహుపరాక్!
http://www.teluguone.com/news/content/court-orders-to-give-back-dowry-25-137964.html





