ఫ్యాన్ స్పీడ్ తగ్గింది.. వైసీపీ నేతల్లో భయం పెరిగింది
Publish Date:Apr 26, 2022
Advertisement
వైసీపీ దూకుడు మాయం అయిపోయింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ మౌనం ఆ పార్టీ ఉనికినే నామమాత్రంగా మార్చేసింది. ఏ మంటే ఏమౌతుందోన్న భయం కొత్త మంత్రుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఎప్పుడూ ఎదురుదాడితో ప్రత్యర్థుల మీద విమర్శలతో విరుచుకుపడే వైసీపీలో ఇప్పుడెందుకీ మౌనం.
పార్టీలో లొసుగులు, ప్రభుత్వంలో అవకతవకలు ఒక్కసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలలో బట్టబయలైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం కారణంగా అన్ని వర్గాలూ జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్నాయని మంత్రి పదవులు కోల్పొయిన మాజీ సచివులు బహిరంగంగానే వెళ్లగక్కేసారు.
అదే సమయంలో తెలుగదేశం కూడా స్పీడ్ పెంచింది. మాట తిప్పని, మడమ తిప్పని వైసీపీ నేత అసలు రీతిని ఎండగడుతూ విమర్శల దూకుడు పెంచింది. మామూలు పరిస్థితుల్లో అయితే వైసీపీ శ్రేణులు, ట్రేడ్ మార్క్ నేతలు తెలుగదేశంపై దూషణలతో విరుచుకుపడేవారు. ఇప్పుడా పని చేయడానికి వారు ముందుకు రావడం లేదు. ముందుకు రావడం లేదు అనే కంటే సాహసించడం లేదని చెప్పడం సబబుగా ఉంటుంది. వైకాపా మౌనం వ్యూహాత్మకమేమీ కాదనీ, సొంత పార్టీలోనే అసమ్మతి బుసలు కొడుతుంటే...ఏం మాట్లాడితే ఏమౌతుందోనన్న భయమే వారిని మౌనాన్నిఆశ్రయించేలా చేస్తున్నదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా విపక్షం విమర్శలను తిప్పి కొట్టే బాధ్యత మంత్రలు తీసుకుంటారు. జగన్ గత మంత్రివర్గం అంతా తమ శాఖకు సంబంధిచిన విషయాలపై కంటే ప్రత్యర్థి పార్టీని దనుమాడటంపైనే దృష్టి సారించారు. విమర్శలలో హద్దులను కూడా పాటించని సందర్భాలెన్నో ఉన్నాయి. విపక్ష నేతనూ, నేత కుటుంబీకుల్నీ కూడా వ్యక్తిత్వ హననం చేయడమే లక్ష్యంగా విమర్శలు చేశారు.
అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పరిధి దాటి విమర్శిస్తే ప్రజాక్షేత్రంలో పలుచన అవుతామన్న విషయం వారికి స్పష్టంగా అర్ధమైంది. ఇక తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శించాలంటే ఆ ప్రభుత్వ పాలనలో కంటే వైసీపీ పాలనలో అభివృద్ధి మెండుగా జరిగిందని చెప్పుకోగలగాలి. మూడేళ్ల పాలన అనంతరం అభివృద్ధి గురించి మాట్లాడేందుకు వైసీపీకి ఒక్క అంశం కూడా కనిపించని పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాల గురించి చెప్పుకుందామా అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులెవరూ తాము సంతోషంగా ఉన్నామని చెప్పడానికి ముందుకు రావడం లేదు. పైపైచ్చు ఏ వర్గాలకైతే తాము సంక్షేమ పథకాలు అందించామని వైసీసీ చెప్పుకుంటోందో... ఆవర్గాల నుంచే ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిస్థితుల్లోనే కొత్త మంత్రులకు తమ ప్రభుత్వం ఘనత ఇదీ అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. కొత్త టీమ్ లో వాగ్ధాటి ఉన్న నేతలుగా గుర్తింపు పొందిన అంబటి రాంబాబు, రోజా కూడా మునుపటి విమర్శల దాడిని కొనసాగించేందుకు జంకుతున్నట్లుగా కనిపిస్తున్నది.
అంబటి రాంబాబు అయితే మంత్రిగా తొలి విలేకరుల సమావేశంలోనే మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను... నేను చెప్పింది రాసుకోండి చాలు అంటూ చేతులెత్తేశారు. ఇక రోజా సొంత నియోజకవర్గంలోనే తీవ్రమైన అసమ్మతిని ఎదుర్కొంటూ...మౌనమే మేలు అన్నట్లుగా ఉన్నారు. మహిళా హోంమంత్రి తొలి మీడియా మీట్ లోనే తాను డమ్మీనని చెప్పకనే చెప్పేశారు. ఇక మంత్రులకు బదులుగా మీడియా ముందుకు వచ్చి సర్కాస్టిక్ గా విపక్షంపై విమర్శలు గుప్పించే సజ్జల... కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత తొలి సారిగా తమ ప్రభుత్వ అజెండా ఏమిటన్నది బయటపెట్టేశారు. చంద్రబాబును మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని కుండ బద్దలు కొట్టేశారు. ఆ సింగిల్ పాయింట్ అజెండా తప్ప తమ ప్రభుత్వానికి మరేదీ ముఖ్యం కాదనేశారు. దీంతో వైసీపీకి చెప్పుకోవడానికి ఇంకేం మిగలలేదు. అందుకే ఏం లేనప్పుడు మాట్లడడమెందుకని వైకాపా నేతలు మౌనాన్నే ఆశ్రయించారు.
తన పలుకుబడి పలుచన అయ్యిందన్న గ్రహింపునకు వచ్చిన జగన్ ఇక పాలన సంగతి తరువాత చూసుకుందాం...ముందు తనకు అచ్చొచ్చిన ఫార్ములా జనం సమస్యలు తెలుసుకునే పేరుతో ప్రజలలోకి వెళదాం అన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే రాజకీయ పండితులు మాత్రం విపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనంలోకి వెడితే సమస్యలు తెలుస్తాయి కానీ, అధికారంలో ఉండి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రజలలోకి వెళ్లడం వల్ల ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/fan-speed-comes-down-fear-increases-in-ycp-39-134987.html





