కెన్యా మాయాద్వీపం మిస్టరీ.. అడుగుపెడితే శవాలు కూడా దొరకవు..?
Publish Date:Jul 3, 2026
Advertisement
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి. అలాంటి ఒక భయంకరమైన, అంతుచిక్కని మాయాద్వీపమే కెన్యాలో ఉంది. హాలీవుడ్ సినిమాల్లో చూపించే అడ్వెంచర్ ఐలాండ్స్ లాగా, అక్కడికి వెళ్లిన వాళ్లు వెళ్లినట్లే మాయమైపోతారు. కనీసం వారి శవాలు కూడా దొరకవు. ఉత్తర కెన్యాలోని రుడాల్ఫ్ సరస్సు మధ్యలో ఉన్న ఈ వింత ద్వీపం పేరు 'ఎన్వైటెనెట్'. స్థానిక గిరిజన తెగ అయిన 'ఎల్ మోలో' భాషలో ఈ పేరుకు అర్థం "నో రిటర్న్" అంటే తిరిగి రావడం లేదని అర్థం. చుట్టూ అందమైన సరస్సు, దట్టమైన అడవి ఉన్నప్పటికీ ఈ ద్వీపంలో ప్రస్తుతం ఒక్క మనిషి కూడా నివసించడం లేదు. ఈ దీవికి ఏదో శాపం ఉందని, అందుకే అక్కడికి వెళ్లిన వారంతా మరణిస్తున్నారని స్థానికులు గట్టిగా నమ్ముతారు. చాలా ఏళ్ల క్రితం ఈ ద్వీపంలో కొంతమంది గిరిజనులు నివసించేవారని చరిత్ర చెబుతోంది. వారు వేటాడుతూ, చేపలు పడుతూ హ్యాపీగా బతికేవారు. బాగా నాగరికత తెలిసిన ఆ ద్వీపవాసులు తరచూ బయటి ప్రపంచంలోకి వచ్చి వ్యాపారాలు కూడా చేసేవారు. అయితే చాలా సంవత్సరాల పాటు ప్రశాంతంగా సాగిన వారి జీవితాల్లో ఒక రాత్రి ఊహించని విపత్తు సంభవించింది. ఒక రోజు వారు మెయిన్ ల్యాండ్‌కు రావడం హఠాత్తుగా ఆపేశారు. దాంతో అనుమానం వచ్చిన పక్క ఊరి ఎల్ మోలో తెగవారు గుంపుగా కలిసి ఆ ద్వీపానికి వెళ్లి చూశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ఆ ద్వీపమంతా ఘోరమైన నిశ్శబ్దంతో, పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. అక్కడ ఎంత వెతికినా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. కానీ ఆశ్చర్యకరంగా వారి గుడిసెలు, బాణాలు, నిల్వ చేసుకున్న ఉల్లిగడ్డలు మరియు వస్తువులన్నీ అలాగే చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆరిపోయిన పొయ్యిల దగ్గర కుళ్ళిపోతున్న చేపలు కనిపించాయి. అంటే వారు ముందే ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఒకవేళ ఎవరైనా దాడి చేసి చంపేస్తే కనీసం శవాలు లేదా రక్తపు గుర్తులు ఉండాలి, కానీ అలాంటి ఆధారాలేవీ అక్కడ లేవు. ఆ దీవిలో ఉన్న భయానక వాతావరణాన్ని తట్టుకోలేక వచ్చిన వారు హుటాహుటిన వెనక్కి తిరిగొచ్చారు. ఆ తర్వాత ఆ ద్వీపానికి వెళ్లిన వారిలో చాలామంది గాయపడ్డారు, కొందరు వికలాంగులయ్యారు, మరికొందరు చనిపోయారు. గజఈతగాళ్లు సైతం ఆ సరస్సులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ అంతుచిక్కని మిస్టరీని ఛేదించడానికి 1935 లో వివినా ఫష్ అనే బ్రిటిష్ రీసెర్చర్ ఒక సాహసోపేతమైన ప్రయత్నం చేశాడు. తన ఇద్దరు నమ్మకస్థులైన రీసెర్చర్లు ఎం.షెప్లిస్, బి. దేసన్లను ఆ ద్వీపంలో పరిశోధనల కోసం పంపాడు. వారు ప్రతిరోజూ సాయంత్రం తాము సురక్షితంగా ఉన్నామని చెప్పడానికి ద్వీపంలోని ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించి సిగ్నల్స్ ఇచ్చేవారు. అంతా సజావుగానే సాగుతోంది అనుకుంటున్న తరుణంలో, రెండు వారాల తర్వాత హఠాత్తుగా ఆ దీపాలు వెలగడం ఆగిపోయాయి, సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఆందోళనతో రీసెర్చ్ బృందం ద్వీపానికి వెళ్లి వెతకగా వారి గుడారం అలాగే ఉంది కానీ ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు మాయమైపోయారు. కనీసం వారి మృతదేహాలు కూడా లభించలేదు. విమానాలతో గాలించినా, చెట్టు చెట్టు వెతికినా వారి ఆచూకీ దొరకలేదు. అక్కడ క్రూర జంతువులు కూడా లేవు, మరి వారు ఏమయ్యారనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. స్థానిక ఇతిహాసాల ప్రకారం ఆ ద్వీపంలో భూమి లోపలికి చొచ్చుకుపోయిన కొన్ని వింత పైపులు ఉన్నాయి. వాటి నుండి అప్పుడప్పుడు మంటలు వస్తుంటాయని నమ్ముతారు. అలాగే ఆ దీవి ఎప్పుడూ దట్టమైన పొగమంచుతో నిండి ఉంటుందని, అక్కడ ఎవరికీ కనిపించని ఒక మాయా నగరం దాగి ఉందని గిరిజనులు చెబుతుంటారు. ఆ నగరం నుండి వచ్చే కాంతి ఇంద్రధనుస్సులా, బంగారు ఆభరణాలు మెరిసినట్లు తళతళా మెరుస్తుందని, అక్కడి అద్భుతమైన టవర్ల నుండి వింత శబ్దాలు వస్తాయని అంటారు. ఆ శబ్దాలు విన్నవారు కొన్నాళ్లపాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడతారని స్థానికుల నమ్మకం. సైన్స్‌కు సైతం అంతుచిక్కని ఈ 'నో రిటర్న్' ఐలాండ్ రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక పెద్ద మిస్టరీ.
http://www.teluguone.com/news/content/envaitenet-island-mystery-45-224968.html




