కేంద్ర మంత్రిగా డీకే అరుణ.. లీక్ ఇచ్చిన మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
Publish Date:Jun 30, 2026
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక లీక్ ఇచ్చారు. రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2029 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి వరుసగా నాలుగో సారి అధికారపగ్గాలు అందుకోవడమే లక్ష్యంగా మోడీ కేబినెట్ ను ప్రక్షాళన చేయనున్నారని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి విదితమే. పార్లమెంట్ వర్షాకాలసమావేశాలకు ముందే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న జాతీయ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ రాబిన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానో, యధాలాపంగానో వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుండి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు క్యాబినెట్ జి. కిషన్ రెడ్డి కాగా, మరొకరు బండి సంజయ్ కుమార్. రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా తెలంగాణ నుండి మరొకరికి కూడా అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. సామాజిక సమతుల్యతను సాధించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు తెలంగాణ నుంచి మరో మంత్రికి అవకాశం ఇవ్వాలన్నది హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ తరుణంగా కిషన్ రెడ్డి డీకే అరుణ పేరు ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన సామాజికవర్గానికే చెందిన డీకే అరుణకు కేంద్ర కేబినెట్ లో స్థానం అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. కేబినెట్ బెర్త్ రేసులో ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం కేబినెట్ లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకే కిషన్ రెడ్డి డీకే అరుణ పేరు ప్రస్తావించారని అంటున్నారు. ఇక ఇదే సందర్భంగా బండి సంజయ్ భవితవ్వంపై కూడా రకరకాలుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. కుమారుడిపై పోక్సో కేసు నేపథ్యంలో బండి సంజయ్ కు కూడా కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి ఆయనకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనీ, అప్పుడు రాష్ట్రం నుంచి ముగ్గురికి కొత్తగా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనీ అంటున్నారు. అప్పడు సామాజిక సమతుల్యాన్ని పాటించి అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన వారికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kishan-reddy-hints-dkaruna-union-minister-45-224597.html




