పొత్తుకు, లొంగుబాటుకు ఇదీ తేడా!
Publish Date:Jun 20, 2026
Advertisement
ప్రస్తుత భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పొత్తుల పేరుతో తమ పార్టీల స్వయం ప్రతిపత్తిని హస్తిన కేంద్రంగా పని చేసే జాతీయ పార్టీలకు తాకట్టు పెట్టడం వల్లే ఉనికి కాపాడుకోగలమన్నట్లుగా పలు ప్రాంతీయ పార్టీల తీరు ఉంది. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. పొత్తుకు, లొంగుబాటుకు తేడా ఏంటో ప్రస్ఫుటంగా కనిపించేలా వ్యవహరించారు. తద్వారా తన, తన పార్టీ టీవీకే రాజకీయ వ్యక్తిత్వాన్ని చాటారు. సినీమా హీరో నుంచి రాజకీయనాయకుడిగా మారిన విజయ్.. తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. అయితే.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉంటాననీ, అధికారం కోసం సిద్ధాంతాలను వదులుకునే రకం తాను కాదనీ చేతల ద్వారా చూపించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. పొత్తు అంటే కేవలం ఎన్నికల సర్దుబాటు మాత్రమేనని.. అది ఢిల్లీ నాయకత్వానికి లొంగిపోవడం కాదని ఆచరణలో చూపుతున్నారు. ఇంతకీ ఇంత పెద్ద ఉపోద్ఘాతమెందుకంటే.. తాజాగా తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నది తమ కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ.. పొరుగు రాష్ట్ర నిర్ణయం వల్ల తమిళనాడు రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పడం ద్వారా తనకు రాజకీయ అవసరాల కంటే తమిళనాడు ప్రయోజనాలే ముఖ్యమని చాటారు. మామూలుగా ఒక జాతీయ పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు, ఇతర రాష్ట్రాల్లోని అదే పార్టీ ప్రభుత్వంపై మాట్లాడటానికి ప్రాంతీయ నేతలు ముందు వెనుకలాడతారు. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి.. రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలే తనకైనా, తన పార్టీకైనా అత్యంత ప్రాధాన్యతా అంశాలను అసెంబ్లీ వేదికగా ఉద్ఘాటించారు. పొత్తులు పెట్టుకోవడం వేరు, లొంగిపోవడం వేరు అనే స్పష్టమైన సంకేతాన్ని విజయ్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారని పరిశీలకులు సైతం విజయ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ చూపిన ఈ రాజకీయ పరిణితి, పొత్తు విచ్ఛిన్నమయ్యే ముప్పు ఉన్నా.. వెరవని సాహసంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పొత్తులో ఉంటూనే.. రాష్ట్ర హక్కుల కోసం రాజీ లేకుండా పోరాడే కొత్త ఒరవడికి విజయ్ శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు.
http://www.teluguone.com/news/content/-difference-between-alliance-and-capitulation-45-223587.html




