పశ్చిమ బెంగాల్ లో సువేందు సర్కార్ సంచలన నిర్ణయం.. మతం ప్రాతిపదికన ఆర్థిక సహాయానికి ఎండ్ కార్డ్
Publish Date:May 18, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ రాజకీయంలో విధానపరంగా కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మతపరమైన సంస్థలకు, వ్యక్తులకు అందిస్తున్న ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పూర్తిగా రద్దు చేసింది వచ్చే నెల నుండి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా హిందూత్వ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండే పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ, అధికారంలోకి రాగానే మతపరమైన వర్గీకరణల ఆధారంగా నడిచే పథకాలను నిలిపివేయడం గమనార్హం. గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో మదరసాలకు కేటాయించిన ప్రత్యేక పథకాలను కూడా నూతన ప్రభుత్వం రద్దు చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా నిర్దిష్ట వర్గాలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉద్దేశించిన పథకాలను తమ ప్రభుత్వం ప్రోత్సహించబోదని ముఖ్యమంత్రి సువేందు అధికారి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రజాధనాన్ని కేవలం ప్రజల సంక్షేమం, విద్యా రంగం, ఆర్థిక సాధికారత కోసమే వినియోగించాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల పంపిణీ అక్రమాలపై విచారణ జరిపేందుకు సువేందు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. గతంలో కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఉదంతంతో పాటు సందేశ్‌ఖాలీలో వెలుగుచూసిన మహిళలపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో, నూతన ప్రభుత్వం మహిళా రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో తాము ఇచ్చిన భత్, నాట్ భత్తా అంటే.. ఉచిత భత్యాలు కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యం అనే నినాదానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సువేందు అధికారి స్పష్టంగా చెప్పారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును మతపరమైన కార్యక్రమాలకు కాకుండా, ప్రజా సంక్షేమానికి మళ్లించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/end-to-financial-assistance-based-on-religion-39-220214.html





