'మస్క్' మజా.. టెస్లా ఓనర్ చేతికి ట్విటర్...
Publish Date:Apr 26, 2022
Advertisement
రూ.3.30 లక్షల కోట్లకు ట్విటర్‌ను కొనుక్కున్నారు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. ముందుగా పెట్టుబడుల రూపంలో ట్విటర్లో 9 శాతం వాటా చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత తెలిసింది.. ట్విటర్లో వాక్ స్వేచ్చ అనుకున్నంత లేదని. ఇలా అయితే కంపెనీ పురోగతి కష్టమని భావించారు. ట్విటర్‌ను నడపడం మీ వల్ల కాదంటూ.. మొత్తం తానే కొనుక్కుంటానంటూ యాజమాన్యానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొదట అలా కుదరదు.. అమ్మేదేలేదంటూ ట్విటర్ బోర్డు మొండికేసింది. పరోక్షంగా పూర్తి వాటాలు సొంతం చేసుకునేలా మస్క్ పావులు కదుపుతున్నారని తెలిసి.. ఇక అతనితో మనకెందుకులేనని.. ట్విటర్‌ను గంపగుత్తగా మస్క్‌కు అమ్మేసేందుకు ముందుకొచ్చింది యాజమాన్యం. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున.. మొత్తం 46.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.30 లక్షల కోట్లు)కు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో 100శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నారు ఎలాన్ మస్క్. ఫేస్బుక్, టిక్‌టాక్‌తో పోలిస్తే తక్కువ మంది యూజర్లు ఉన్నప్పటికీ, ప్రముఖ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావి వర్గం అకౌంట్స్‌తో ట్విటర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. వాక్ స్వేచ్ఛకు వేదిక అవుతుందన్న నమ్మకంతోనే కంపెనీలో పెట్టుబడులు పెట్టానని, కాకపోతే ప్రస్తుత స్థితిలో కంపెనీ వాక్ స్వేచ్ఛను పెంచకపోవడమే కాదు, కల్పించనూ లేదని పెట్టుబడులు పెట్టాక నాకు అవగతమైందంటూ ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలర్‌కు ఇటీవల మస్క్ లెటర్ రాశారు. లిస్టెడ్ కంపెనీగా ఉన్న ట్విటర్‌ను ప్రైవేట్ కంపెనీగా మారాల్సిన అవసరం ఉందని.. అందుకే సంస్థను పూర్తిగా కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు లేఖలో ప్రతిపాదించారు. అనుకున్నట్టుగానే అతితక్కువ సమయంలోనే ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అందుకు కావలసిన నిధులను బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సమీకరించారు. టెస్లా అధినేత మస్క్ ట్విటర్‌ను కొంటున్నారనే సమాచారంతో.. స్టాక్ మార్కెట్లో ట్విటర్ షేరు ధర అమాంతం పెరిగిపోయింది.
http://www.teluguone.com/news/content/elon-musk-bought-twitter-39-134976.html





