మద్యం కుంభకోణం కేసు.. ఆ 11 కోట్ల వివరాలివ్వండి..సిట్ ను కోరిన ఈడీ
Publish Date:Jul 31, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో బుధవారం (జులై 30) పట్టుబడ్డ 11 కోట్లరూపాయల వివరాలను ఇవ్వాల్సిందిగా సిట్ ను కోరింది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంట్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గట్టి షాక్ గానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పుడు శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లకు సంబంధించిన వివరాలను ఈడీ సిట్ ద్వారా సేకరించడంతో ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నదన్న విషయం తేటతెల్లమైంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజ్ కేసి రెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ ఇప్పటికే రికార్డు చేసింది. అలాగే చంద్రారెడ్డినీ విచారించింది. ఇప్పుడు సిట్ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల వ్యవహారలో కూడా కొందరికి నోటీసులు ఇచ్చే దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మద్యం కుంభకోణం కేసులో ఒక వైపు సిట్.. మరో వైపు ఈడీ దర్యాప్తు స్పీడ్ ను పెంచేయడంతో ఈ కేసు పాత్రధారులు, సూత్రధారుల దగ్గరకు దర్యాప్తు చేరుతోందని అంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అసలు పాత్రధాని, సూత్రధారి జగనే అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులు తమ వాంగ్మూలంలో జగన్ పేరు చెబితే ఆయన కూడా అరెస్టయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈడీ దూకుడు, సిట్ స్పీడ్ జగన్ కు షాక్ ఇస్తుందనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసు నమోదు అయిన వెంటనే దేశం దాటి వెళ్లిన వరుణ్ చక్రవర్తిని అరెస్టు చేసిన సిట్ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టి, దాని ఆధారంగానే 11 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే వరుణ్ చక్రవర్తి నుంచి రాబట్టిన సమాచారంతో మరి కొన్ని ప్రాంతాలలో కూడా సిట్ సోదాలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేసిన సిట్ మరిన్ని అరెస్టులకు సిద్ధమౌతోందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ed-entry-in-liquor-scam-case-25-203156.html





