మోడీ ముందస్తు మంత్రం నిజమేనా?
Publish Date:Jun 17, 2023
Advertisement
కేంద్ర పభుత్వం ముందస్తు యోచన చేస్తోందా? కర్నాటక ఎన్నికల ఫలితం తరువాత మూడో సారి విజయంపై బీజేపీలో అనుమానాలు మొదలయ్యాయా. కర్నాటక ఫలితం తరువాత జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీల ఐక్యతా యత్నాలు సవ్యదిశలో సాగడం, ఐక్యత విషయంలో విపక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు అవకాశాలు మెరుగయ్యాయన్న భావనతో.. అదే జరిగితే మోడీ సర్కార్ హ్యాట్రిక్ కల నెరవేరడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకే విపక్షాల ఐక్యతా యత్నాలు కొలిక్కి వచ్చేలోగానే ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు పచ్చ జెండా ఊపేస్తే... రాజకీయంగా లబ్ధి చేకూరుతుందన్న నమ్మకంతో బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి 2014లో ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జమిలి మంత్రం జపిస్తూనే ఉంది. అయితే రాజకీయ సంక్లిష్టతల ఆ తరువాత 2019లో మోడీ సారథ్యంలోని బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించినా ఆ ఆలోచనను అమలులో పెట్టలేకపోయింది. అయితే జమిలితోనే కేంద్రంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోగలమన్న భావన మాత్రం ఆ పార్టీలో గట్టిగా ఉందని ఆ పార్టీ అగ్రనేతలే కాదు మోడీ కూడా పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు, ప్రకటనల ద్వారా తేటతెల్లమైంది. జమిలి కోసం కసరత్తు చయడమూ మానలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా కార్యాచరణ చేస్తున్నదని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు ప్రకటించే అవకాశం మాత్రం ఇసుమంతైనా లేదు. ఇక జమిలి ఎన్నికలకు అనుకూలంగా మేథావులు, సామాజిక, రాజకీయ విశ్లేషకుల నుంచి సానుకూల స్పందన లభించే విధంగా కేంద్రం తన ప్రయత్నాలను తాను సాగిస్తూ వస్తోంది. అది పక్కన పెడితే.. తొమ్మిదేళ్ల మోడీ పాలన తరువాత.. కేంద్రం ఎంతగా భారత్ దూసుకుపోతోంది లాంటి నినాదాలతో ఘనతను చాటుకుంటున్నా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. గతంలో వాజ్ పేయి ప్రభుత్వం భారత్ వెలిగిపోతోంది నినాదంతో ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతిని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇక మోడీ సర్కార్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గుర్తించిందనీ, దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయం కోసం కొత్త కొత్త వ్యూహాలను రూపొందించుకునే క్రమంలో భాగంగానే ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడంపై సమాలోచనలు జరుపుతోందని పోలిటికల్ సర్కిల్స్ లో ఓ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగాల్సిన ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ కేంద్ర కమిటీ చర్చోపచర్చలు జరుపుతోందని కేంద్రానికి సన్నిహితంగా ఉండే వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి. అలాగే ఈ ఏడాది జూలైలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం చేసిన కీలక ప్రకటననూ గుర్తుచేస్తున్నాయి. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం లా కమీషనర్ పరిశీలనలో వుందని కేంద్రం పార్లమెంటు వేదికగా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తున్నాయి. అప్పటికి కేంద్రంలోని మోడీ సర్కార్ కు ప్రభుత్వ వ్యతిరేకత స్థాయి ఇప్పటంత తీవ్రంగా లేకపోవడం, 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయంపై ధీమా అధికంగా ఉండటంతో ..2029 ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలను కార్యరూపంలోకి తీసుకువస్తే సరిపోతుందని భావించింది. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం, విపక్షాలు ఐక్యంగా ఉంటే విజయం సులభ సాధ్యం కాదన్న గ్రహింపునకు రావడంతో.. ఆ ఐక్యతా యత్నాలు ఓ కొలిక్కి వచ్చేలోగానే సార్వత్రిక ఎన్నికలను ముందస్తుగా జరిపించేసి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలన్న దిశగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ యోచిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/early-general-elections-39-156950.html





