తెరపైకి డ్రగ్స్ దందా .. టీఆర్ఎస్ డైవర్ష న్ పాలిటిక్స్ కు రెడీ మేడ్ టాపిక్
Publish Date:May 9, 2022
Advertisement
డైవర్షన్ పాలిటిక్స్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరితేరిపోయారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ.. ఆ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చి జనం దృష్టి, మీడియా కాన్ సన్ ట్రేషన్ ను డైవర్ట్ చేసి ఇబ్బందుల నుంచి బయటపడటం అన్నది పరిపాటిగా మారిపోయింది. దీని వల్ల నాడు పబ్ లో ఉన్న సెలిబ్రిటీల పిల్లల ప్రతిష్ట ఒకింత మసకబారింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోళ్ల విషయంలో వెల్లువెత్తుతున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పడింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యంతో రైతులలో వ్యక్తమౌతున్న నిరసన, అన్ని వైపుల నుంచీ సర్కార్ పై పెరుగుతున్న ఒత్తిడిల నుంచి జనం దృష్టి మళ్లిపోయింది. డ్రగ్స్ వివాదంపైనే విపక్షాలు, మీడియా కాన్ సన్ ట్రేట్ చేయడంతో రైతుల సమస్యల మరుగున పడిపోయింది. అంతే డ్రగ్స్ వివాదమూ సద్దుమణిగింది.
తెలంగాణలో టీఆర్ఎస్ డ్రగ్స్ దందాను డైవర్షన్ పాలిటిక్స్ కు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీమేడ్ ఇష్యూగా వాడుకుంటోంది. ఇటీవల ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరిగిందంటూ చేసిన హడావుడి వెనుక కూడా డైవర్షన్ పాలిటిక్స్ వ్యూహమే ఉందంటున్నారు. ప్రముఖుల పిల్లలు, మైనర్లు ఉన్నారనీ, వారంతా పబ్ లో డ్రగ్స్ సేవించారనీ ఆరోపణలు వచ్చాయి. అర్ధ రాత్రి దాటిన తరువాత కూడా నిబంధనలకు విరుద్ధంగా పబ్ తెరచి ఉంచి లోపల డ్రగ్స్ సరఫనా చేస్తున్నారనీ పోలీసులు మీడియా సమావేశాలు పెట్టి మరీ వెల్లడించారు. సినీ ఫక్కీలో అర్ధరాత్రి దాటిన తరువాత రైడ్ చేసి వందల మందిని అదుపులోనికి తీసుకున్నారు. వారందరినీ డ్రగ్స్ టెస్ట్ చేసి వివరాలు తెలుసుకుని విడిచిపెట్టారు. ఆ తరువాత కథ మామూలే.. మూడు, నాలుగు రోజుల తరువాత ఆ రోజు పబ్ లో పట్టుబడిన వారెవరూ డ్రగ్స్ వినియోగించలేదని పరీక్షల్లో తేలిందని ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు.
అలాగే గతంలో కూడా మియాపూర్ భూ కుంభకోణం నుంచి జనం దృష్టి మరల్చడానికి డ్రగ్స్ దందాను తెరపైకి తీసుకు వచ్చారు. మియాపూర్ భూ కుంభకోణంలో టీఆర్ఎస్ ప్రముఖుల పేర్లు ఉండటంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరైంది. కేకే, కేకే కుమార్తె, గోల్డ్ స్టోన్ పార్థ సారథి వంటి వారికి భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. గోల్డ్ స్టోన్ పార్థసారథిని పోలీసులు అరెస్టు చేశారు కూడా. అప్పట్లో కేకే వంటి వారు ఈ భూ కుంభకోణంతో తమకు సంబంధం లేదనీ, చట్ట ప్రకారమే భూములు కొన్నామనీ వివరణ ఇచ్చినా కూడా ఎవరూ నమ్మలేదు. ప్రభుత్వ ప్రతిష్ట వేగంగా దిగజారుతోందని గ్రహించిన ముఖ్య మంత్రి స్వయంగా రంగంలోని దిగి మియామూర్ లో భూ కుంభకోణం ఏమీ లేదని, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్ర్రేషన్లు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కూడా ఫలింలేదు. రోజు రోజుకూ భూ కుంభకోణం వ్యవహారం తీవ్ర రాజకీయ సమస్యగా ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్న తరుణంలో సర్కార్ ను ఆదుకున్నది డ్రగ్స్ వ్యవహారమే. అప్పట్లో సినీ ప్రముఖులు డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ పూరి జగన్నాథ్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి వంటి ప్రముఖులను విచారించారు. వారి నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. బ్యాంకు అక్కౌంట్ల వివరాలనూ తీసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది. దీంతో మియాపూర్ భూ కుంభకోణం అంశం మరుగున పడిపోయింది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. అంతే ఆ తరువాత తీరిగ్గా సినీ ప్రముఖులందరికీ డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ లభించింది. సినీ ప్రముఖుల డ్రగ్స్ దందాపై విచారణకు తెలంగాణ సర్కార్ ఎక్సైజ్ శాఖ తరఫున సిట్ ఏర్పాటు చేసి మరీ విచారణ జరిపించింది. 12 మంది సినీ ప్రముఖులను పిలిపించి మరీ విచారణ చేసింది. ఆ తరువాత షరా మామూలే. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ లభించింది. దానికంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరింది. మియాపూర్ భూముల కుంభకోణం మరుగున పడింది.
http://www.teluguone.com/news/content/drugs-issue-ready-made-topic-for-diversion-politics-25-135656.html





