తెలుగుదేశం మహానాడుకు బస్సులు పంపితే కబడ్డార్.. రవాణా శాఖ హెచ్చరికలు
Publish Date:May 24, 2022
Advertisement
తెలుగుదేశం మహానాడుకు బస్సులు పంపితే కబడ్డార్ అంటూ ఏపీ రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను మహానాడుకు పంపించకుండా ఆయా యాజమాన్యాలకు హెచ్చరికలు చేసింది. అంతటితో ఆగకుండా మహానాడుకు ఒక రోజు ముందే అంటే బుధవారం సాయంత్రాని కల్లా అన్ని బస్సులూ, వ్యానులూ తమకు అప్పగించాలంటూ గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రైవేటు ఆపరేటర్లు, స్కూళ్లు కాలేజీల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు పోన్లు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అప్పగించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని చెబుతున్నారు. అలా అప్పగించమనడానికి వారు చెబుతున్న కారణం హాస్యా స్పదంగా ఉంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ మంత్రుల బస్సు యాత్ర 25వ తేదీ నుంచీ మొదలౌతోందనీ, అందు కోసం 25 సాయంత్రాని కల్లా వాహనాలను తమకు అప్పించాలనీ చెబుతున్నారు. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చి తీరాలని కోరుకుంటూ మండువవారిపాలెం రైతులు తమ భూములను మహానాడు కోసం ఇచ్చిన సంగతి విదితమే. ఈ నెల 27 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 వేల మందితో మహానాడు సభ జరుగుతుంది. ఆ రోజున మహానాడు వేదిక నుంచి 17 తీర్మానాలు ప్రవేశపెట్టాలని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ నెల 28 సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కూడా టీడీపీ ప్రారంభిస్తుంది. రెండో రోజున అదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో మహానాడుకు జనం ప్రభంజనంలా రాబోతున్నారన్న అంచనాలున్నాయి. ఇలా ఉండగా టీడీపీ మహానాడుకు జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మహానాడు కోసం ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుని చలానా కూడా కట్టేసిన తరువాత బస్సులు ఇచ్చేది లేదని జగన్ సర్కార్ చెబుతోంది. మహానాడు కోసం వాహనాలు పంపిస్తే.. వాటిని సీజ్ చేస్తామంటూ రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ఆపరేటర్లను బెదిస్తోంది. జగన్ సర్కార్ తీరు పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మహానాడుకు బస్సులు ఇవ్వవద్దంటూ ప్రైవేటు ఆపరేటర్లు, స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు ఫోన్లు చేసి బెదరించిన రవాణా శాఖ అధికారుల వివరాలు సేకరించామనీ, వారందరూ త్వరలోనే తగు మూల్యం చెల్లించక తప్పదనీ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు అన్నారు. గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు సన్నద్ధమయ్యాయి. జగన్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగు తమ్ముళ్లు బెదరరని అచ్చన్నాయుడు అన్నారు. మహానాడు సక్సెస్ కాకుండా చేయాలనే కుట్రతోనే వైసీపీ సర్కార్ అధికారుల ద్వారా పావులు కదుపుతోందని, విమర్శించారు. స్టేడియం ఇస్తామని కలెక్టర్ చెబితే.. అద్దె కూడా కట్టామని, అయితే.. ఆ తరువాత తీరిగ్గా స్టేడియంను ఇచ్చేది లేదని కలెక్టర్ చెప్పారని ఆయన విమర్శించారు.
http://www.teluguone.com/news/content/dont-give-busses-to-mahanadu-ap-transport-officers-threat-ens-to-operators-25-136377.html





