ఇలా చేస్తే చాలు... పిల్లలు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలంటే ఇష్టపడతారు..!
Publish Date:Oct 29, 2026
Advertisement
ఇలా చేస్తే చాలు... పిల్లలు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలంటే ఇష్టపడతారు..!
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్ఫోన్లు, టీవి, వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. చాలామంది పిల్లలు పుస్తకాలు చదవడం అంటే కేవలం స్కూల్ హోమ్‌వర్క్ లేదా పరీక్షలకే పరిమితం అనుకంటున్నారు కూడా. దీనివల్ల వాళ్లకు పుస్తకాల మీద ఇష్టం తగ్గిపోయి, రోజంతా డిజిటల్ స్క్రీన్ల ముందే గడపడానికి అలవాటు పడుతున్నారు. అయితే కొన్ని సరైన పద్ధతులు పాటిస్తే పిల్లలు కూడా ఫోన్లను పక్కన పెట్టి పుస్తకాలు చదవడానకి, పుస్తకాలతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఆ పద్దులు ఏంటో వివరంగా తెలుసుకుంటే..
చదువు మీద ఇష్టాన్ని పెంచాలి..
పిల్లల్లో చదువుపై ఆసక్తి కలగాలంటే ముందుగా వారి ఆలోచనలు మార్చాలి, వారు చదివే విధానాన్ని బలంగా మార్చాలి. ఏదైనా విషయాన్ని బట్టీ పట్టడం కంటే దాన్ని సులభంగా అర్థం చేసుకునేలా వారిని ఎంకరేజ్ చేయాలి. క్లిష్టమైన విషయాలను సరైన ఉదాహరణలు, అందమైన బొమ్మలు , ఆసక్తికరమైన కథల ద్వారా వివరించాలి. అలాగే ఆటలు, పజిల్స్ , క్విజ్ వంటి సరదా కార్యకలాపాల ద్వారా వారికి చదువు మీద ఆసక్తి పెరిగేలా చేయాలి. ఎప్పుడైతే నేర్చుకోవడం అనేది ఒక ఆటలా మారుతుందో, అప్పుడు పిల్లలు తమంతట తామే పుస్తకాల వైపు ఆకర్షితులవుతారు.
జీవితానికి అన్వయించాలి..
చదువు అంటే కేవలం స్కూల్ పుస్తకాలు మాత్రమే కాదని, అది మన రోజువారీ జీవితంలో ప్రతి క్షణం ఉపయోగపడుతుందని పిల్లలకు తెలియజేయాలి. ఉదాహరణకు ఇంట్లో వంట చేసేటప్పుడు కూరగాయలు , పండ్ల పేర్లు పరిచయం చేయడం, షాపింగ్ చేసేటప్పుడు లెక్కలు నేర్పించడం, గడియారం చూసి సమయం చెప్పడం లేదా క్యాలెండర్ చూడటం వంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకోవడాన్ని ఎంతో సులభతరం చేస్తాయి. తాము చదివే చదువు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకున్నప్పుడు పిల్లలు మరింత ఉత్సాహంగా పుస్తకాలు చదవడానికి ముందుకు వస్తారు.
మెల్లిగా అలవాటు చేయాలి..
పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటును క్రమం తప్పకుండా మెల్లిగా నేర్పించాలి. దీనికోసం ప్రతిరోజూ ఒక పది పదిహేను నిమిషాలు కేటాయించాలి. మొదట్లో రోజూ ఒక పేజీ చదవడం, ఒక కొత్త కథ తెలుసుకోవడం లేదా ఒక కొత్త పదం నేర్చుకోవడం వంటి చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. క్రమక్రమంగా ఈ అలవాటు వారి దినచర్యలో భాగమైపోతుంది. ఇలా రోజూ చదవడం వల్ల వారిలో విషయాలను గ్రహించే శక్తి పెరగడంతో పాటు వారి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది.
భయపెట్టకూడదు..
పిల్లలు తప్పులు చేయడం అనేది చాలా సహజం. వారిని ఎప్పుడూ కోప్పడటం లేదా భయపెట్టడం చేయకూడదు. బదులుగా వారు చేసిన తప్పుల నుంచి స్వయంగా వారే నేర్చుకునేలా మంచి వాతావరణం కల్పించాలి. తప్పు చేయడం అనేది నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగమని ప్రేమగా అర్థం అయ్యేలా చెప్పాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న సరదా ప్రశ్నలు అడగడం ద్వారా వారి ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలు ఎలాంటి భయం లేకుండా కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.
పెద్దల అలవాటుతోనే పిల్లలకు కూడా..
పిల్లలు ఎల్లప్పుడూ తమ పెద్దలు చేసే పనులనే చూసి నేర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దలు పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడం చూసి పెరిగితే పిల్లలపై దాని ప్రభావం బలంగా పడుతుంది. అందుకే ఇంట్లో ఒక చిన్న రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేసి, అక్కడ రంగురంగుల కథల పుస్తకాలు , బొమ్మల పుస్తకాలు ఉంచాలి. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి కూర్చుని పుస్తకాలు చదివి, ఆ కథల గురించి చర్చించాలి. ఇలాంటి చిన్న ప్రయత్నాలతో పిల్లలు మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి పుస్తకాలతో సంతోషంగా కాలం గడపడం ప్రారంభిస్తారు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/do-this-and-your-kids-will-put-down-the-phone-and-love-reading-35-235792.html





