చిక్కుముళ్ల మహాఘట్ బంధన్!
Publish Date:Oct 14, 2025
Advertisement
కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుపై ధీమాతో ఉన్న ఇండియా కూటమి.. అదేనండి బీహార్ లో మహాఘట్ బంధన్ లో సీట్ల సర్దుబాటు వ్యవహారం చిచ్చు రేపుతోంది. వాస్తవిక బలంతో సంబంధం లేకుండా కూటమి పార్టీలూ వేటికవి తమకే సింహభాగం కావాలని పట్టుబడుతుండటంతో మొదటికే మోసం వస్తుందా అనిపించేలా మారింది. మహాఘట్ బంధన్ పార్టీల సీనియర్ నాయకుల మధ్య సోమవారం (అక్టోబర్ 13) సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సీట్ల సర్దుబాటు వరకూ ఎందుకు అసలు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపైనా పీటముడి పడింది. మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థిపై చర్చంచేందుకు హస్తిన వెళ్లిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్.. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడిని కానీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కానీ కలవకుండానే తిరిగి పాట్నాకు వచ్చేశారు. అలాగే ఈ కూటమిలో మరో భాగస్వామ్య పార్టీ అయిన వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహానీ కూడా తమ పార్టీకి కేవలం 18 స్థానాలే కేటాయిస్తామనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన 30 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ అలా ఇవ్వకుంటే కూటమి నుంచి నిష్క్రమిస్తానని హెచ్చరిస్తున్నారు. అంత వరకూ ఎందుకు.. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ తాను గత ఎన్నికలలో పోటీ చేసిన విధంగానే ఈ సారి కూడా 70 స్థానాలను డిమాండ్ చేస్తున్నది. అయితే అందుకు కూటమిలోని మిగిలిన పార్టీలు ఏమంత సుముఖంగా లేవు. గత ఎన్నికలలో కాంగ్రెస్ 70 స్థానాలలో పోటీ చేసి కేవలం 19 స్థానాలలోనే గెలిచిన సంగతిని గుర్తు చస్తూ 60 స్థానాలతో సరిపెట్టుకోవాలని ఆర్జేడీ చెబుతోంది. అయితే ఇందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది. గత ఎన్నికలకూ ఇప్పటికీ చాలా తేడా ఉందని చెబుతూ.. రాహుల్ గాంధీ ఒటు అధికార యాత్ర తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెబుతోంది. అంతే కాదు.. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో సహాని అసంతృప్తితో వైదొలిగితే.. ఆ సీట్లులో కూడా తమ పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తారని కాంగ్రెస్ అంటోంది. అయితే ఆర్జేడీ ఇందుకు అంగీకరించడం లేదు. కూటమి ఇన్ టాక్ట్ గా ఉండాల్సిందే అని పట్టుబడుతోంది. మొత్తం మీద సీట్ల సర్దుబాటు విషయంలో మహాఘట్ బంధన్ లో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఆ కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఐదేళ్లుగా బీహార్ లో ఏకతాటిపై ఉన్న మహాఘట్ బంధన్ ఎన్నికల ముందు ఇలా అంతర్గత విభేదాలను రచ్చకీడ్చుకోవడం.. ఎన్డీయేకు కలిసివస్తుందని అంటున్నారు.
ఇండీ కూటమి ముక్కలేనా?
http://www.teluguone.com/news/content/differences-in-mahaghatbandhan-on-seatadjustment-39-207921.html





