సీఎం జగన్ లో ఓటమి వణుకు?.. అందుకే హిందూపురం టు ఇచ్ఛాపురం టూర్!
Publish Date:Aug 30, 2022
Advertisement
మూడున్నరేళ్లకు ముందు ‘ఒక్క చాన్స్’ అంటూ జనం ముందు చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. తీరా ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసి అఖండ మెజారిటీ అధికారం అప్పగించిన అదే జనానికి ముఖం చాటేశారు. అడపా దడపా అదే జనం మధ్యకు రావాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు వారికి ఏమాత్రం అందుబాటు లేకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, పరదాలు వేసుకుని లేదా.. గాల్లోనే చక్కర్లు కొట్టేసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు మూడున్నరేళ్ల పాలన తర్వాత జనంలో ప్రభుత్వ వ్యతిరేకత అంటే జగన్ పై వ్యతిరేకత సునామీలా ముంచేస్తుంటే మరోసారి అదే జనం వద్దకు వచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నారని వైసీపీ శ్రేణుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నకుంటారంటూ నిర్వహిస్తున్న జనాభిప్రాయం సేకరణలో చంద్రబాబుకు 78.17 శాతం మంది ఓటు వేశారు. వైఎస్ జగన్ కు అనుకూలంగా కేవలం 18.27 శాతం మందే ఓకే చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ 3.56 శాతం మంది కోరారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ఇంచుమించు ఇలాంటి ఏకపక్ష ఫలితమే కనిపించడం విశేషం. రఘురామ సర్వేలో 93 స్థానాల్లో టీడీపీ కచ్చితంగా గెలుస్తున్నట్లు తేలడం విశేషం. పోటా పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కూడా 50 శాతం టీడీపీకే అనుకూల ఫలితాలు ఉన్నాయన్నది ఆయన సర్వే సారాంశం. ఏ సర్వే చూసినా చంద్రబాబే విజయయాత్ర చేస్తారని తేలుతోంది. అంతెందుకు జగన్ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలలో కూడా ఇంచుమించు ఇదే ఫలితం రావడంతో ఆయన నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తానంటూ ఒక జాబితా కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన విడుదల చేసిన జాబితాలో పేర్కొన్న నియోజకవర్గాలన్నిటిలోనూ వైసీపీ ఓటమి ఖాయమని ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలో తేలిందని పరిశీలకులు అంటున్నారు. ఒక పక్కన రోజు రోజుకూ తగ్గిపోతున్న వైసీపీ హవా.. మరో పక్కన ఏ క్షణంలో అయినా జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసే సూచనలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలకు ముందు అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు జగన్ జనం మధ్యనే ఉన్న విషయం తెలిసిందే. తన బెయిల్ గనుక రద్దయితే ఇప్పుడు కూడా జనం మధ్యే ఉండి మరోసారి తనకు ఇబ్బందులు తెలెత్తకుండా తప్పించుకునేందుకే రాష్ట్ర యాత్రకు ఉపక్రమిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రణాళికలో భాగంగా నియోజవర్గాల వారీగా పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటున్న జగన్ కు గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం పట్టు దొరకడం లేదట. 23 చోట్ల టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాలలో వైసీపీకి ఇప్పటికీ కాలు మోపే సందు దొరకని పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. టీడీపీకి తిరుగులేని ఈ నియోజకవర్గాల్లో ఎలాగైనా తన ఉనికి చాటుకోవాలని జగన్ యత్నిస్తున్నారంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న టీడీపీ నేతలను వైసీపీలోకి ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రయోగించారు. అయినప్పటికీ జగన్ ఆటలు సాగలేదంటున్నారు. అందుకే మూడున్నరేళ్లుగా జనానికి ముఖం చాటేసిన జగన్ మళ్లీ జనం మధ్యకు రావాలని నిర్ణయించారని అంటున్నారు. ముక్తాయింపు ఏమింటంటే.. సీపీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని ప్రకటించడంతో జగన్ లో ఆందోళన మొదలైందంటున్నారు. అందుకే.. ఉద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించడమే కాకుండా, అరెస్టులు చేయించారు. అంతటితో ఆగకుండా తాను నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నాలుగు అడుగుల ఎత్తు ఐరెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం. కేవలం రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల అల్టిమేటానికే ఇంతలా భయపడుతున్న జగన్ రేపు ఐదున్నర కోట్ల మంది జనానికి ఏం సమాధానం చెప్పుకుంటారు? ఏం చేశానని చెప్పుకుంటారు? మళ్లీ తనకు ఓటు వేసి గెలిపించాలనే ఎలా అభ్యర్థిస్తారన్నది చూడాల్సిందేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
దీంతో జగన్ లో ఓటమి వణుకు మొదలైందంటున్నారు. ఈ క్రమంలో జగన్ హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది కూడా ఏపీలో వైసీపీ పట్ల వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగించేందుకు రూట్ మ్యాప్ సిద్ధమైందంటున్నారు. గతంలో జనం మధ్యలో ఉన్న తనను ఓటర్లు మెచ్చి ఓట్లు వేశారని, అందుకే 151 స్థానాలు ఇచ్చి తనకు తిరుగులేని మెజారిటీ అందించారని జగన్ గొప్పగా చెబుతుంటారు. అనేక వ్యతిరేకతలు, వైఫల్యాల కారణంగా ఈసారి వైసీపీకి గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోయినా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ఆయన నమ్ముతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీకి కావాల్సిన సీట్లు సాధించాలనే వ్యూహంతో జగన్ మరోసారి జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/defeat-fear-in-jagan-so-planing-to-statewide-tour-25-142963.html





