అస్తమిస్తోన్న సూర్యుడు..మారన్ సోదరుల మధ్య గొడవేంటి?
Publish Date:Jun 21, 2025
Advertisement
డీఎంకే ఎంపీ దయానిధి మారన్, భారతీయ కుబేరుల్లో ఒకడైన కళానిధి మారన్ కి మధ్య ఆస్తి చిచ్చు మొదలైందా? అంటే అవునని తెలుస్తోంది. 2003లో తండ్రి మురసోలి మారన్ మరణించారు. సరిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి తగాదా. అప్పట్లో తన తండ్రి మరణించిన వెంటనే కళానిధి మారన్.. అక్రమంగా 12 లక్షల షేర్లను నామ మాత్రం విలువ, అంటే రూ. 10 చొప్పున షేర్లు తన పేరిట కేటాయింపులు చేసుకున్నారనీ.. ఆ టైంలో ఈ షేరు విలువ రెండున్నర వేల నుంచి సుమారు రూ.3 వేల వరకూ ఉండేదని.. దీంతో ఆయన 60 శాతం వరకూ వాటాలను కైవసం చేసుకుని అక్రమంగా సన్ నెట్ వర్క్ యజమాని అయ్యారని ఆరోపిస్తున్నారు దయానిధి మారన్. అందుకే తాము 2003 నాటి పాత యాజమాన్య స్థితికి కంపెనీని తీసుకురావల్సిందిగా కోరుతున్నారు దయానిధి మారన్. తాను కూడా చట్టపరమైన వారసుడ్నేననీ.. తన తండ్రి మరణ దృవీకరణ, చట్టబద్ధమైన వారసత్వ పత్రాల్లేకుండానే కళానిధి తనకు దక్కాల్సిన షేర్లు, డివిడెండ్లు, ఆస్తులు, ఆదాయాలను దక్కకుండా చేశారని.. అవన్నీ తిరిగి చెల్లించకుంటే తాను సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఆర్వోసీ వంటి సంస్థలకు కంప్లయింట్ తీస్కెళ్లాల్సి ఉంటుందని తన నోటీసుల ద్వారా హెచ్చరించారు మారన్ బ్రదర్. ఈ దిశగా జూన్ 10న మారన్ తన సోదరుడికి లా ధర్మ అనే సంస్థ ద్వారా నోటీసులు పంపించారు. కళానిధి మారన్ 2003 నుంచి 2023 వరకూ ఏకంగా 8500 కోట్ల మేర అక్రమ నిధులను ఎన్నో విభాగాల్లో పెట్టుబడులు పెట్టారనీ.. ఇదంతా చట్టవిరుద్ధమనీ అంటారు దయానిధి మారన్. 2024లో కళానిధి ఏకంగా 455 కోట్ల విలువైన డివెండ్లు పొందారని.. తన భార్య కావేరి, తాను కలపి సీఈవోగా ఒక్కొక్కరూ అరవై కోట్లకు పైగా.. ప్యాకేజ్ తీస్కుంటున్నారనీ.. ఆయన 2023లో భారత కుబేరుల జాబితాలో 77వ బిలియనీర్ గా ఎదిగారంటే దాని వెనక- ఈ అక్రమ షేర్ల బదలాయింపు ఉందని అంటున్నారు దయానిధి మారన్. మరీ ముఖ్యంగా కంపెనీల చట్టం 212 ప్రకారం.. చూస్తే కళానిధి పెట్టుబడులు పెట్టిన టీవీ, రేడియో, క్రీడా, విమాన యాన ఇలా ఎన్నో రంగాల లైసెన్సులు రద్దు అయ్యే ప్రమాదమున్నట్టు తెలుస్తోంది. సన్ నెట్ వర్క్ కింద 37 చానెళ్లు, 69 రేడియో స్టేసన్లుండగా.. వీటితో పాటు సన్ పిక్చర్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థ ఉండగా.. 2023లో ఈ సంస్థ నుంచి జైలర్ సినిమా విడుదలై వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది.ఇక కళానిధి కుమార్తె కావ్య మారన్ ఇక్కడ ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తో పాటు సౌతాఫ్రికాలోనూ ఒక క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ టీములు 2016లో ఐపీఎల్, 2023-24లో దక్షిణాఫ్రికా చాంపియన్ గా నిలిచాయి. ఇక ఇంగ్లండ్ లోనూ ఒక క్రికెట్ టీమ్ ని కొనుగోలు చేసింది కావ్యనాయకత్వంలోని సన్ నెట్ వర్క్. అంతే కాదు విమానయానంలోనూ పెట్టుబడులు పెట్టిందీ సంస్థ. వీటన్నిటి లైసెన్సులూ ఇప్పుడు ప్రమాదంలో పడ్డంతో పాటు.. వెయ్యి మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలపైనా ఈ ప్రభావం పడేలా తెలుస్తోంది.దానికి తోడు దయానిధి మారన్ డీఎంకే ఎంపీ కూడా కావడంతో రాజకీయంగానూ ఈ ఆస్తి వివాదం.. వచ్చే ఎన్నికలపై ప్రభావం పడేలా ఉందని అంచనా వేస్తున్నారు. మరి దీనంతటికీ ఈ కుటుంబం ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా తేలాల్సి ఉంది. 2018 వరకూ కరుణానిధి జీవించి ఉండగా.. ఆయన ద్వారా ఇలాంటి కుటుంబ సమస్యలు ఎన్నో క్లియర్ అవుతూ వచ్చేవి. ఎందుకంటే కరుణానిధికి మేనల్లుడే మురుసోలి మారన్. దానికి తోడు తన మేనమామ మీదున్న ప్రేమ కొద్దీ మురసోలి ఆయన పేరును పోలిన పేర్లు తనపిల్లలకు పెట్టారు. ఈ క్రమంలో ఆయన లేక పోవడం ఒకరకంగా ఈ కుటుంబం మధ్య వివాదం నానాటికీ పెరిగి పెద్దదవుతూ వచ్చింది. ఇప్పుడు కరుణ తనయుడు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి. ఆయనకున్న ప్రభుత్వ, రాజకీయ పని ఒత్తిడి కారణంగా ఈ కుటుంబ తగాదాలు తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. కళానిధి తెలివిగా తన ఒకే ఒక్క సోదరికి 500 కోట్ల రూపాయలు బదిలీ చేసి తద్వారా కుటుంబంలో తనపై ఒత్తిడి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక్కడ మరో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే.. దయానిధి ఇన్నాళ్లకు తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి.. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ రచ్చను చట్టపరంగా ఎదుర్కోడానికి సిద్ధపడ్డం వెనక ఉద్దేశమేంటన్నది అర్ధం కావడం లేదెవరికీ.
http://www.teluguone.com/news/content/dayanidhi-maran-39-200393.html





