కష్టంగా మారిన యూకే ప్రయాణికుల ట్రేసింగ్ ! కొత్త కరోనాతో మళ్లీ టెన్షన్
Publish Date:Dec 24, 2020
Advertisement
ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్ మెంట్.. ఐసోలేషన్.. ఈ పదాలు కరోనా దేశంలోకి ఎంటరైన కొత్తలో విన్న పదాలు. మార్చి నెలలో అధికారులంతా వీటి చుట్టే తిరిగారు. విదేశాల నుంచి వచ్చే వారిని ట్రేస్ చేయడం.. వారిని టెస్టింగ్ చేయడం.. కరోనా సోకినట్లు నిర్దారణ అయితే ట్రీట్ మెంట్ చేయడం... పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ చేయడమే ప్రధానంగా ఉండేది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ , సెకండరీ కాంటాక్ట్ ను ట్రేస్ చేసి .. వారికి టెస్టింగ్ చేయడానికి ఆరోగ్య శాఖ అధికారులు పరుగులు పెట్టేవారు. మార్చి, ఏప్రిల్, మే నెల వరకు ఎక్కడ చూసినా, విన్నా.. ఈ పదాలే వినిపించేవి. మళ్లీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అవే పరిస్థితులు నెల కొన్నాయి. ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్ మెంట్.. ఐసోలేషన్.. ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ అంటూ ప్రభుత్వ యంత్రాంగమంతా ఉరుగులు పరుగులు పెడుతోంది. యూకే నుంచి వచ్చిన ఓ మహిళకు పాజిటివ్‌గా తేలడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వణికిపోతోంది. సంబంధిత మహిళ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 22న ఢిల్లీలో బయలుదేరి, బుధవారం రాత్రి రాజమహేంద్రవరం చేరారు. రాజమహేంద్రవరం చేరుకున్న మహిళను రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖ, పోలీసు అధికారులు 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళతోపాటు ఆమె కుమారుడికి సైతం పీపీఈ కిట్లు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. వాళ్ల బ్లడ్ శాంపుల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. యూకే నుంచి వచ్చిన మహిళకు సోకింది కొత్త రకం కరోనానా లేక పాత కరోనానా అనే సంగతి ఇంకా నిర్ధారణ కాలేదు. లండన్ నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన మహిళ క్వారంటైన్‌లో ఉండకుండానే ఇక్కడికి వచ్చారని ప్రచారం జరగడంతో జిల్లావాసులు భయపడిపోతున్నారు.కొత్త వైరస్ జాడను కాకినాడలోని వైరాలజీ ల్యాబ్‌లో నిర్ధారించే పరిస్థితి లేకపోవడంతో.. వాళ్ల నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. తెలంగాణ అధికారులు కూడా బ్రిటన్ నుంచి వచ్చిన 12 వందల మందిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరిని ట్రేస్ చేసి కరోనా పరీక్షలు నిర్వహించారు. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ స్ట్రెయిన్ వైరస్ పై కరీంనగర్ లో ఆందోళన నెలకొంది. బ్రిటన్ నుంచి ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లాకు వచ్చిన 16 మందిని గుర్తించి వైరస్ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఎయిర్ పోర్టులో చేసిన ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలో నెగిటివ్ అని తేలిన తర్వాతే ఇళ్లకు వచ్చారని.. అయినా ముందు జాగ్రత్తగా మరోసారి పరీక్షలు చేస్తున్నామని జిల్లా వైధ్యాధికారులు తెలిపారు. వీళ్లంతా ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆదేశించినట్టు చెప్పారు. బ్రిటన్ నుంచి నిర్మల్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఇద్దరి సాంపుల్స్ సేకరించారు ఆరోగ్య సిబ్బంది. ఆదిలాబాద్ కు వచ్చిన యువకుడికి రిపోర్ట్ నెగిటివ్ రావడంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత 20 రోజుల నుంచి యూకే నుంచి సంగారెడ్డి జిల్లాకు వచ్చిన 26 మందిని ట్రేస్ చేసి టెస్టింగ్ చేశారు. వారిలో 17 మందికి నెగిటివ్ రిపోర్ట్ రాగా.. మిగిలిన వారికి రావాల్సి ఉంది.
బ్రిటన్ లో విజృంభిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయిస్తున్నారు అధికారులు. బ్రిటన్ నుంచి ఏపీకి నేరుగా విమానాలు లేకపోయినా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి ఏపీకి వెళతారు. అయితే డిసెంబర్ 9 నుంచి యూకే విమానాలు బంద్ అయ్యే వరకు దాదాపు 3 వేల మంది ప్రయాణికులు లండన్ నుంచి వచ్చారని తెలుస్తోంది. వీరిలో 18 వందల మంది ఏపీ , 12 వందల మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారని అధికారులు గుర్తించారు. వీళ్లను గుర్తించి కరోనా పరీక్షలు జరిపిస్తున్నారు. యూకే నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచడంతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేట్ చేస్తున్నారు అధికారులు. అయితే యూకే నుంచి వచ్చిన వారిలో కొందరి అడ్రస్ అధికారులు , పోలీసులకు దొరకడం లేదని తెలుస్తోంది. పాస్ పోర్టులో ఉన్న అడ్రస్ లో వారు ఉండటం లేదని చెబుతున్నారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
http://www.teluguone.com/news/content/coronavirus-39-108114.html





