తెలంగాణలో హస్తానిదే హవా !?
Publish Date:Jun 19, 2023
Advertisement
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో... ఊహించడం కొంచం కాదు చాలా కష్టం. కానీ రాజకీయాలు చాలా వరకు ఊహాగానాలు, వ్యూహాగానాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఒకటి రెండు నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఈరోజున్న పరిస్థితి ఏమిటి? అని అలోచిస్తే.. ఆరోజున్న పరిస్థితికి, ఈ రోజు కాంగ్రెస్ లో కనిపిస్తున్న పరిస్థితులకు ఎక్కడా పొంతన, పోలిక లేదు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అధికార బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సవాల్ గా మారింది. సవాలు విసురుతోంది. అధికారంలోకి వచ్చేశామనే ధీమా కనిపిస్తోంది. మరోవంక ఒక్కసారిగా బెలూన్ లా పైకేగిరిన బీజేపీ ... కర్ణాటక ఓటమితో దిగాలు పడిపోయింది. నేలచూపులు చూస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కమలం పరిస్థితి మళ్ళీ సింగిల్ డిజిట్ స్థాయికి దిగిపోయిందనే పబ్లిక్ పర్సెప్షన్ బలం పుంజుకుంటోంది. దీంతో అధికార బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధిగా తెర మీదకు వచ్చింది. అందుకే ఇంతవరకు ముక్కోణపు పోటీలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని లెక్కలు వేసుకున్న విశ్లేషకులు ఇదే పర్సెప్షన్ ఎన్నికల వరకు కొనసాగితే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ పోరు తప్పదని అంటున్నారు. మరోవంక కర్ణాటక గెలుపు తెచ్చిన ఊపును నిలుపుకునేందుకు, ఇదే జోష్ ను ఎన్నికల వరకు కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతున్న సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను బేస్ చేసుకుని కాంగ్రెస్ ఇమేజ్ ని పెచుకునేందుకు తద్వారా అధికార బీఆర్ఎస్ నుండి అసమ్మతి నాయకులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో వంక ‘అపరచిత’ /అజ్ఞాత సంస్థల సర్వేలకు ప్రచారం కల్పిస్తోంది. నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంత ‘గొప్ప’ విజయం సాధించిన తర్వాత కూడా, పొంగులేటి, జూపల్లి వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో ఇంకా మీన మేషాలు లెక్కిస్తున్నారు. మీడియా ‘పొంగు’ ను పొంగులేటి పట్టించుకోవడం లేదు. రాజకీయ వ్యాపారంలో లాభ నష్టాలు బేరీజు వేసుకుంటున్నారు. ఆ ఇద్దరు చివరకు ఏమి చేస్తారు, అనేది ప్రస్తుతానికి శేష ప్రశ్న. అలాగని ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరరని కాదు .అఫ్కోర్స్ చేరతారని కూడా చెప్పలేము. అది వేరే విషయం. ఆ ఇద్దరి సంగతి ఎలా ఉన్నా,ఇతర చిన్నా చితక నాయకులైనా పోలోమంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారా అంటే అదీ లేదు. నిజానికి, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన ఊహాజనిత ఊపు, ఉత్సాహం వచ్చాయేమో కానీ, చేరికల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి కొత్తగా తోడైన వాస్తవ బలం, బలగం దాదాపు శూన్యం. అయితే అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం అసలే లేదా, అంటే లేదని అనలేము. కానీ, ఉహించుకుంటున్న స్థాయిలో ఉంటుందా ? అజ్ఞాత సర్వే.. లో చెప్పినట్లుగా.. బీఆర్ఎస్ కు సమ ఉజ్జీగా 40 నుంచి 45 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందా? అంటే అనుమానమే. అంటున్నారు విశ్లేషకులు.
http://www.teluguone.com/news/content/congress-strengthend-in-telangana-39-157035.html





