ఒక్క ట్వీట్..ఒకే ఒక్క ట్వీట్.. గంగలో కలిసిన కాంగ్రెస్ పరువు!
Publish Date:Apr 27, 2022
Advertisement
దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, స్వాతంత్ర్య సంగ్రామంలో ముందు పీఠిన నిలిచిన పార్టీ..దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ....దాదాపు 5 దశాబ్దాలు దేశ రాజకీయాలనుశాశించిన పార్టీ.. వందేళ్లకుకు పైబడిన చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ పరువు ఒక్క ట్వీట్..ఒకే ఒక్క ట్వీట్తో గంగలో నిండా మునిగింది. ఆ ట్వీట్ చేసినది ఎన్నికల వ్యూహకర్తగా ఇటీవల గుర్తింపు పొందిన పీకేఅనబడే ప్రశాంత్ కిశోర్. ఆయన ట్వీట్ వటవృక్షం లాంటి కాంగ్రెస్ కూకటి వేళ్లను వణికించింది. ఇంతకీ ఆయనా ట్వీట్ లో ఏమన్నారంటే...కాంగ్రెస్ కు నాయకుడు కావాలి అని మాత్రమే. ఆ ఒక్క మాట కాంగ్రెస్శ్రేణుల ఇన్నేళ్ల ధీమానూ కకావికళం చేసింది. ఆ పార్టీ అధినాయకత్వం ఆత్మ విశ్వాసాన్నే దెబ్బ తీసింది. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఈ పదేళ్ల కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆపార్టీకి పరాభవమే ఎదురౌతోంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా చేజారి పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించింది.పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు రూపొందించాలని కోరింది. ఈ క్రమంలోనే ప్రశాంత్కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సహా ఆ పార్టీ కోర్ నాయకులతో వరసగా భేటీలు జరిపారు. ఇంత
వరకూ బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేసేందుకుఏర్పాటు చేసిన సాధికార కమిటీలో భాగమై పని చేయాల్సిందిగా స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పీకేను ఆహ్వానించారు. ఇక్కడ వరకూ బానే ఉంది...అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆహ్వానానికి పీకే స్పందించిన తీరే కాంగ్రెస్ పరువు ప్రతిష్టలను నడి బజార్లో నిలబెట్టేసింది. పార్టీని నవ్వుల పాలు చేసింది. వ్యూహకర్తను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో ఆ పార్టీ వ్యూహాత్మక వైఫల్యం పార్టీ అధినేత్రి ప్రతిష్టను పలుచన చేసింది.
ఇంతకీ పీకే...సోనియా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ...చేసిన ట్వీట్ లో పేర్కొన్న అంశాలే ఆ పార్టీ నాయకత్వాన్ని తలెత్తుకోనీయకుండా చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కావలసింది తన లాంటి వ్యూహ కర్తలు కాదనీ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగిన సమర్థ నాయకత్వం కావాలని పీకే సోనియా గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. పార్టీకి సమర్థ నాయకత్వం లేదనీ సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత్రికే ట్వీట్ చేశారు. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కు అంత త్వరగా తేరుకోవడానికి వీలులేని పెద్ద ఎదురు దెబ్బగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధినాయకత్వంపై ధిక్కారం కేవలం జీ-23 బృందానికే పరిమితమైంది. ఇక ఇప్పుడు అది మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.ఒక వైపు సోనియా గాంధీ, పీకే చర్చలు జరుగుతున్న సమయంలోనే పీకేను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రకటనలు రావడం, వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తడమే ఇందుకు నిరసనగా వారు చూపుతున్నారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ యేతర కూటమి ఏర్పాట్లు, బీజేపీని దీటుగా ఎదుర్కోవాలన్న కాంగ్రెస్ యత్నాలకు ఇది పెద్ద ఎదురు దెబ్బే!
http://www.teluguone.com/news/content/congress-prestige-drowned-with-only-one-tweet-39-135096.html





