పరాన్నజీవిగా కాషాయ పార్టీ.. విపక్షాల అనైక్యతపైనే మనుగడ!
Publish Date:Apr 27, 2022
Advertisement
రెండు పర్యాయాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోందా? ప్రజా వ్యతిరేకత గూడుకట్టుకున్నప్పటికీ విపక్షాల అనైక్యతపైనే మూడో సారి కూడా అధికార పీఠం దక్కించుకోగలనన్నధీమాతో ఉందా. సొంత బలం తక్కువైనా విపక్షాల అనైక్యతే బలంగా మారి పరాన్న జీవిగా గట్టేక్కే పరిస్థితి ఉందని భావిస్తోందా. దేశంలో రాజకీయ వాతావరణాన్ని గమనిస్తుంటే బీజేపీ సొంత బలం కన్నా విపక్షాల అనైక్యతపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుందనే భావించాల్సి ఉంటుంది. పరిశీలకులు కూడా అదే చెబుతున్నారు. బీజేపీ యేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉండటమే ఇందుకు కారణం. సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంగా బీజేపీ యేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు సజావుగా ముందుకు సాగడం లేదు. బీజేపీయేతర కూటమికి నాయకత్వం వహించే పార్టీ ఏదన్న విషయంపై విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. పరిస్థితిని అంచనా వేసిన కాంగ్రెస్ ఒక అడుగు తగ్గి అయినా బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆ పార్టీ నాయకత్వంలో పని చేసేందుకు మిగిలిన పార్టీలు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పని చేయడానికి సుతరామూ ఇష్టపడటం లేదు. ఎన్నికలకు ముందే బీజేపీయేతర కూటమిని పటిష్ట పరుచాలని, దానికి కాంగ్రెస్ కేంద్ర బిందువుగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. తమ తమ రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎన్నికల అనంతరం బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ జట్టు కట్టి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. అప్పుడు సీట్ల సంఖ్యను బట్టి సంకీర్ణానికి నాయకత్వం వహించే పార్టీ ఏదన్నది తేలుతుందన్నది ఆయా పార్టీల ఉద్దేశం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలా పలువురు నాయకులు ఎవరికి వారు బీజేపీ యేతర కూటమికి తామే సరైన నాయకులమని భావిస్తున్నారు.
రాబోయే లోకసేభ ఎన్నికలలో గతంలో మాదిరిగా వెూదీ ప్రభంజనం ఉండకపోవచ్చన్ని అందరి నిశ్చితాభిప్రాయంగా ఉన్నప్పటికీ...దానికి క్యాష్ చేసుకుని కేంద్రంలో బీజేపీ సర్కార్ ను గద్దె దించేందుకు అవసరమైన రాజకీయ సంకల్పం మాత్రం విపక్షాలలో కనిపించడం లేదు. ఏదోలా బీజేపీయేతర కూటమికి నేతృత్వం వహించి ప్రధాని పీఠం దక్కించుకోవాలన్నదే విపక్ష పార్టీ నేతల ఉద్దేశంలా కనిపిస్తున్నది తప్ప సైద్ధాంతికంగా ఉన్న విభేదాలను పరిష్కరించుకుని బీజేపీయేతర శక్తులన్నిటీని ఏకతాటిపైకి తీసుకురావలన్న చిత్తశుద్ధి ఆయా పార్టీలలో ఇసుమంతైనా కనిపించడం లేదు.
ఆయా రాష్ట్రాలలో ఇంత కాలం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేసి ఇప్పుడు ఆ పార్టీతో జట్టు కడితే ప్రజా వ్యతిరేకత ఎదురౌతుందన్న భయం ఆ పార్టీలది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తు.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరితే కాంగ్రెస్ వ్యతిరేకత తమ ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందని ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలు భావిస్తున్నాయి.
అందుకే బీజేపీ యేతర పార్టీల ఐక్యత కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఇక కాంగ్రెసేతర, బీజేపీ యేతర కూటమి అన్న ప్రతిపాదనకు.. జాతీయ స్థాయిలో పెద్దగా స్పందన రాలేదు. బీజేపీని ఎదుర్కొనాలంటే కాంగ్రెస్ ను కలుపుకు పోక తప్పదనే దాదాపు అన్ని పార్టీల అధినాయకులు భావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలో కలిసి పని చేసే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదు.
అందుకే ప్రజాదరణ తగ్గినా విపక్షాల అనైక్యతే బలంగా మరోసారి అధికారం దక్కించుకో గలమన్న ధీమా కాషాయ పార్టీలో వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/bjp-hopes-on-power-depend-on-opposition-weakmess-39-135098.html





