కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా?
Publish Date:Nov 7, 2015
Advertisement
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేక దేశంలో మత అసహనం, రచయితలపై దాడులు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ మొదలుపెట్టిన మోడీ వ్యతిరేక ప్రచారం అద్భుతమయిన ఫలితాలు ఇస్తుండటంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెదేపా ప్రభుత్వంపై అదే మంత్రం ప్రయోగించదానికి సిద్దపడుతున్నట్లుంది. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడిన మాటలు విన్నట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది. “రాష్ర్టంలో తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. అలాగే సామాజిక వర్గాల మధ్య అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి అభివృద్దిని, అధికారాన్ని అంతా ఒకే చోట కేంద్రీకరిస్తున్న కారణంగానే ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయి. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో సామాజిక అసమానతలు, కొన్ని వర్గాల మధ్య సమతుల్యత దెబ్బ తింటోంది కానీ ఆయన ఎవరి మాట వినే పరిస్థితిలో లేరిప్పుడు,” అని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని అందరికీ తెలుసు. మళ్ళీ ఏదో విధంగా నిలద్రొక్కుకోవాలనే ప్రయత్నంలో ప్రత్యేక హోదా అంశం భుజానికెత్తుకొని ఇంతవరకు పోరాడింది. కానీ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను, మనోభావాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు ఆ ప్రజల కోసమే పోరాడుతోందంటే ఎవరూ నమ్మేందుకు సిద్దంగా లేరు. అందుకే దాని పోరాటాలకి ప్రజల నుండి స్పందన రాలేదు. పరిస్థితులు ఇలాగే మరికొంత కాలం కొనసాగినట్లయితే రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోక తప్పదని వారికీ తెలుసు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అధిష్టానం అమలుచేస్తున్న వ్యూహం రాష్ర్ట కాంగ్రెస్ నేతలకి ఒక ఆశాకిరణంలాగ కనిపించడంతో దానిని అందిపుచ్చుకొని రాష్ర్టంలో తెదేపా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రాంతీయ, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నయంటూ విషప్రచారం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. ఒకవేళ ఈ వ్యూహం ఫలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోవచ్చని భావిస్తున్నరేమో? ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఈ వ్యూహం అమలుచేసినట్లయితే దానిని తెదేపా ఏవిధంగా ఎదుర్కొంటుందో? చూడాలి.
http://www.teluguone.com/news/content/congress-party-45-52127.html





