కేసీఆర్‌కి దిమ్మదిరిగేలా కాంగ్రెస్ ఉచిత హామీలు
Publish Date:Apr 20, 2017
Advertisement
ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా హామీలే ఆయుధం... ఎన్నికల సమయంలో ఇచ్చే ఆ హామీలే పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తుంటాయ్. పార్టీల జాతకాన్నే కాదు... అభ్యర్ధులకు గెలుపోటములకు కూడా హామీలే కారణమవుతుంటాయ్. వందల హామీలు కాదు.... ఒక్కటి చాలు.... పార్టీ జాతకం మారిపోవడానికి, అధికారంలోకి రావడానికి. 2014 ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్... అధికారంలోకి రావడానికి హామీలదే ప్రధాన పాత్ర. ముఖ్యంగా ఉచిత హామీల పవరే వేరు... ఫ్రీ...ఫ్రీ...ఫ్రీ ఈ పదం వింటే చాలు ప్రజలు దాసోహమైపోతారు. అందుకే పార్టీలన్నీ ఉచితానికి అత్యంత ప్రాధాన్యతిస్తాయి. అందుకే ఈ ఉచిత మంత్రాన్ని ఎక్కువ వినిపంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 2014 ఎన్నికల్లో... తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనంటూ ప్రజల్లోకి వెళ్లినా... అధికారంలోకి వస్తే ఏం చేస్తామో సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతోనే దెబ్బతిన్నామని గ్రహించిన టీకాంగ్రెస్ లీడర్లు.... ఈసారి హామీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే మేనిఫెస్టోపై కసరత్తు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించిన రుణమాఫీ హామీని ఈసారి కాంగ్రెస్ జపిస్తోంది. టీఆర్‌ఎస్ పంట రుణాలు మాఫీ చేయగా, కాంగ్రెస్ మాత్రం అన్ని రకాల రుణాలను రెండు లక్షల వరకు మాఫీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అది కూడా విడతల వారీగా కాకుండా, ఒకేసారి ఏకమొత్తం చెల్లిస్తామంటూ హామీ ఇవ్వబోతోంది. అలాగే ఇప్పుడున్న పెన్షన్ల అమౌంట్‌ను రెట్టింపు చేయడం, నిరుద్యోగ భృతి, ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా రైతులను ఆకట్టుకునేలా వ్యవసాయ ప్యాకేజీ ప్రకటించేందుకు టీకాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.కేసీఆర్ ఇఫ్పటికే ఉచిత ఎరువులు ప్రకటించడంతో దానికి అదనంగా ఫ్రీగా విత్తనాలు అందిస్తామని కాంగ్రెస్ చెప్పనుంది. మొత్తానికి ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా, టీఆర్‌ఎస్‌కు దిమ్మదిరిగే హామీలు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/congress-party-45-74104.html





