పలాయనమా? పనికి మాలిన వ్యూహమా?..
Publish Date:Jun 11, 2022
Advertisement
శతాధిక చరిత్ర కలిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. కాంగ్రెస్. దశాబ్దాల పాటు దేశంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన పార్టీ. వరుస విజయాలతో దేశ రాజకీయాలను శాశించిన పార్టీ. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు రాష్ట్రంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు కేవలం రెండంటే రెండు రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారం కాదు కదా.. కనీసం విపక్ష హోదా కూడా నిలుపుకోలేని దుస్థితిలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకోవాలన్న పట్టుదలతో ఉన్నా.. గత ఎనిమిదేళ్లుగా ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబోట్టు అన్న చందంలో ప్రజాదరణలో పలుచన అవుతూ వస్తోంది. దీంతో ఆ పార్టీ అగ్ర నాయకత్వంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా అంటే... ఔననే సమాధానం వస్తుంది. ఎందుకుంటే యూపీలో ఈ నెల 23 న రెండు లోక్ సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది. గత అసెబ్లీ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ నాయకుడు అజంఖాన్ లు తమ తమ లోక్ సభ స్థానాలకు రాజీనామా చేశారు. దాంతో అజంగఢ్, రాంపూర్ పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 23న జరిగే ఈ ఉన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణులనే కాక పరిశీలకులను కూడా నివ్వెర పరిచింది. ఏదైనా రాజకీయ పార్టీ అందుతోనూ కాంగ్రెస్ లాంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ ఎన్నికలకు దూరం అవ్వడం అంటే జనానికి ఏం సంకేతం ఇస్తున్నట్లు. అదీ కాక సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలనుకుంటున్న పార్టీ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో ఉప ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే ఏమనుకోవాలి. కాంగ్రెస్ హైకమాండ్ ఇదో వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పుకుంటున్నప్పటికీ విశ్లేషకులు మాత్రం పలాయన వాదమనే అంటున్నారు. ఏ కారణం లేకుండా పోటీ నుంచి వైదొలగడమంటే.. పలాయనం కాక మరేమిటని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పలాయన వాదంతో పార్టీక రాష్ట్రంలో ఉన్న మద్దతు దారులు, సానుభూతి పరులు కూడా దూరమయ్యే అవకాశాలు మెండు అని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ దయనీయ స్థితికి యూపీ ఉప ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయం అద్దం పడుతోందని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. పార్టీ అగ్ర నాయకత్వంలో విశ్వాసం లోపించిందనడానికి ఇంత కన్నా ఉదాహరణ అవసరం లేదని కూడా పార్టీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.
పోటీలో దిగి పరాజయం పాలౌతామన్న భయంతోనే కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం యూపీలోని పార్టీ శ్రేణులను కూడా అయోమయానికి గురి చేసింది. మద్దతు కోసం సమాజ్ వాదీ పార్టీ కనీసం కాంగ్రెస్ ను సంప్రదంచను కూడా లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించ లేదు.
http://www.teluguone.com/news/content/congress-not-to-contest-in-up-by-poll-due-to-lack-of-confidence-25-137492.html





