టీఆర్ఎస్ లోకి సబితా రెడ్డి.. మరో ఎమ్మెల్యే కూడా!!
Publish Date:Mar 11, 2019
Advertisement
లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సుక్కు, చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు వారి బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ టీఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్ధమైంది. సబితారెడ్డి తన తనయుడైన కార్తీక్‌రెడ్డితో కలిసి ఆదివారం మజ్లిస్‌పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, టీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి పార్టీలో చేరేందుకు సబిత అంగీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి సబితారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వారం రోజుల క్రితం వారు ఎంపీ అసదుద్దీన్‌తో ఈ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా ఆదివారం ఉదయం మరోసారి వారు అసద్ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటికే కేటీఆర్ అక్కడికి వచ్చి చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై తుది దఫా చర్చలు జరిగాయి. సబితకు మంత్రి పదవితో పాటు.. కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి సబితకు మంత్రి పదవి, కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కూడా తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు లేఖ విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ఆమె టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె పార్టీలో చేరేందుకు నిర్ణయించుకుని లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశంసించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సీఎంకు ఉన్న విజన్, దాని కోసం ఆయన పడే తపన.. తనను మంత్రముగ్ధురాలిని చేశాయన్నారు. ఇల్లెందు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ బాటలో పయనించడం శ్రేయస్కరమని భావించినట్లు తెలిపారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం సహకరించిన అన్ని వర్గాల ప్రజల రుణం తీర్చుకోవాలన్నా.. వారికి అభివృద్ధి ఫలాలు అందించాలన్నా తాను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని వివరించారు. తమ పార్టీ శ్రేణులుసహా ఎన్నికల్లో సహకరించిన అందరినీ సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ బి-ఫాంపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ లేఖలో హరిప్రియ వివరించారు.
http://www.teluguone.com/news/content/congress-leader-sabitha-indra-reddy-to-join-trs-39-86214.html





