ఆజాద్ సొంత రాష్ట్రం కాశ్మీర్ లో కాంగ్రెస్ ఖాళీ?
Publish Date:Aug 30, 2022
Advertisement
ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్వంత రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఖాళీ అయిపోతోందా? గులాం నబీ ఆజాద్ కు మద్దతుగా ఆ రాష్ట్రంలో రాజీనామాల పరంపర కొనసాగుతోందా అంటే జరుగుతున్న పరిణామాలను గమనించిన ఎవరైనా ఔనని అనక తప్పదు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ తో తనకున్న అర్ధ శతాబ్దపు అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటూ గత వారం పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. తాను కాంగ్రెస్ ను వీడిన సందర్భంగా గులాం నబీ ఆజాద్ సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ కు రాజకీయాలలో కొనసాగే అర్హత లేదన్నారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ లో సంక్షోభం మొదలైంది. రాష్ట్ర పార్టీ అంతా దాదాపుగా ఆయనకు మద్దతుగా నిలిచింది.ఆజాద్ రాజీనామా చేసిన నాటి నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతు తెలుపుతు కాంగ్రెస్ ను వీడుతున్నారు. తాజాగా గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్‌తో సహా 50 మందికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంగళవారం(ఆగస్టు30) పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో తారాచంద్ తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆజాద్‌కు మద్దతుగా వారంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఉమ్మడిగా రాజీనామా లేఖ సమర్పించారు. కాగా గులాం నబీ ఆజాద్ త్వరలో జాతీయ స్థాయి పార్టీని ప్రారంభిస్తారని జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. వాటిని వేటినీ ఆజాద్ ఖండించకపోవడంతో గులాం నబీ ఆజాద్ త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆజాద్ మద్దతు దారులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/congress-empty-in-jammu-kashmir-after-gulam-nabi-azad-resignation-25-142975.html





