రాజ్యసభకు షర్మిల.. కాంగ్రెస్ బంపరాఫర్
Publish Date:Jun 1, 2026
Advertisement
దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. ఇటీవల తమిళనాడులో టివికెతో పొత్తు పెట్టుకుంది. కేరళలో సైతం అద్భుతమైన రీతిలో అధికార పీఠాన్ని దక్కించుకుని సరికొత్త జోష్‌తో దూసుకుపోతోంది. ఈ విజయాల పరంపరతో లభించిన ఉత్సాహంతో, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్టీ అగ్రనాయకత్వం ఒక భారీ నజరానా ప్రకటించింది. గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్యసభలో పార్లమెంటు కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూనే, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం ఆమెకు ఒక పెద్ద పరీక్ష కానుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత కాపాడుకుంటూ ఎలా ముందుకు సాగుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శల పదును పెంచుతూ, పార్టీ గొంతుకను బలంగా వినిపిస్తున్నారు. తన సొంత అన్న, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి, రాజకీయంగా సొంత మార్గాన్ని ఎంచుకున్న షర్మిల, ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు. గతంలో ఆమె స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఆశించిన స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయినప్పటికీ, ఏపీలో ఆమె నాయకత్వానికి గుర్తింపు లభించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందించిన ఈ రాజ్యసభ సభ్యత్వం వైఎస్ షర్మిల రాజకీయ ఆకాంక్షలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఊతం ఇస్తుందని అంటున్నారు. ఈ కీలకమైన పదవి సాధించిన తర్వాత, ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నడిపిస్తారో మరియు అది రాబోయే రోజుల్లో పార్టీకి ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుందో వేచి చూడాలి.
ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు వైఎస్ షర్మిల రాజ్యసభ నామినేషన్‌ను అధికారికంగా ధృవీకరించినట్లు సమాచారం. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా ఆమెను రాజ్యసభకు పంపేందుకు సర్వం సిద్ధమైంది. వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇది అత్యంత కీలకమైన మలుపుగా, ఒక పెద్ద ప్రమోషన్‌గా నిలుస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఈ పదవి ఆమెకు ఎప్పుడో దక్కాల్సి ఉందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/congress-bumper-offer-to-yssharmila-39-221421.html





