స్థానిక సమరం: కూటమి పార్టీల సీట్ల సర్దుపాట్లు.. దేశం, జనసేన శ్రేణుల్లో భగ్గుమన్నఆగ్రహం.!
Publish Date:Oct 19, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార తెలుగుదేశం కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుపాట్లు హాట్ టాపిక్ గా మారాయి. స్థానిక సమరం సమయంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య నెలకొన్న పొత్తుల సమీకరణాలపై క్షేత్రస్థాయిలో అసమ్మతి, అసంతృప్తి రచ్చకెక్కడం పొలిటికల్ గా సెన్సేషనల్ గా మారింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటుపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా కొందరు నేతలు వ్యవహరిస్తుండటంతో కలకలం రేపుతోంది. కేడర్ నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో పార్టీల మధ్య సమన్వయం ప్రశ్నార్థకంగా మారుతున్న దృశ్యం స్పష్టంగా గోచరిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలను అంచనా వేయకుండా కేవలం ఉమ్మడి నిర్ణయాల పేరుతో సీట్లను కేటాయించడం పట్ల తెలుగుదేశం, జనసేన శ్రేణులలో తీవ్ర అసహనం వ్యక్తమౌతోంది. గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇక్కడ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలను, స్థానిక నాయకులను విస్మరించి సీట్ల కేటాయింపు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిత్రపక్షాల కోటా కింద స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టడం సమజంసం కాదన్న అసంతృప్తి, ఆగ్రహం ఇరు పార్టీల నేతలలోనూ బాహాటంగా వ్యక్తమౌతోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు సైతం క్షేత్రస్థాయి వాస్తవాలను అధిష్టానానికి స్పష్టం చేయడంలో విఫలమవుతున్నారంటూ క్యాడర్ తిరుగుబావుటా ఎగురవేస్తున్న పరిస్థితి ప్రస్ఫుటంగా ద్యోతకమౌతోంది. కూటమి ధర్మాన్ని పాటించే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో స్థానిక కేడర్ మనోభావాలు దెబ్బతింటున్నాయన్నది వాస్తవమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు గుర్తింపు కరవవుతోంద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కొద్ది రోజుల పాటు కూర్చొని పార్టీల అధ్యక్షులు ఎంతో కష్టపడి రూపొందించిన సీట్ల సర్దుబాటు సూత్రాలు గ్రౌండ్ లెవెల్ లో అమలు కావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకరికొకరు సహకరించుకోవాల్సిన చోట, సీట్ల సర్దుబాటుపై ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం కూటమి ఐక్యతకు సవాల్ గా పరిణమించింది. ఇలాంటి పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోంది. తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు, పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అధిష్టానాలు ఒక ఒప్పందానికి వచ్చి సీట్లను ఖరారు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత ఆకాంక్షల కారణంగా ఆ నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదు. దీనివల్ల క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమనడమే కాకుండా, ఐక్యత విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎన్నికల వేళ ఈ తరహా అంతర్గత కుమ్ములాటలు కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తాయన్న ఆందోళన పార్టీల క్యాడర్ లలో వ్యక్తమౌతోంది. ఈ వివాదాలు మరింత ముదరకుండా కూటమి పార్టీల అధిష్ఠానాలు రంగంలోని దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ విభేదాల పర్వం ఇలాగే కొనసాగితే.. స్థానక సమరంలో తెలుగుదేశం కూటమి ఇబ్బందులకు ఎదుర్కొనటం తథ్యమని అంటున్నారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లోపించడం, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి తెలెత్తిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల పెద్దలు ఈ అసంతృప్తి జ్వాలలను ఎలా చల్లారుస్తారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది. [Local body Elections Kutami Seat Sharing, Gollaprolu Municipal Elections, TDP Janasena Alliance Disputes, Andhra Pradesh Politics, CBN, PK,
TeluguOne]
http://www.teluguone.com/news/content/local-body-elections-kutami-seat-sharing-39-234793.html




