మైనార్టీ ఓట్లకు వల వేస్తున్న కాంగ్రెస్
Publish Date:May 2, 2014
Advertisement
“చంద్రబాబుకి ఓటేస్తే అది మోడీకి వేసినట్లే! తేదేపాకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే! తెదేపా, బీజేపీలు నాణేనికి బొమ్మ బొరుసు వంటివి కూటమి” ఇది కాంగ్రెస్ వాదన. తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నప్పుడే వారే ఆవిషయం స్వయంగా దృవీకరించారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పనిగట్టుకొని మళ్ళీ ఎందుకీ ప్రచారం చేస్తోందంటే, మతతత్వ బీజేపీని బూచిగా చూపిస్తూ మైనార్టీల ఓట్లు దండుకోవడానికే. వారిలో అభద్రతాభావం కల్పించి, వారిని తెదేపా నుండి దూరం చేసి తద్వారా బీజేపీని దెబ్బతీసేందుకే. అయితే తెదేపా బీజేపీతో అవసరార్ధం పొత్తులు పెట్టుకొన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలాగే తెదేపా కూడా పూర్తి సెక్యులర్ పార్టీయేనని అందరికీ తెలుసు. అయినప్పటికీ అది బీజేపీతో పొత్తులు పెట్టుకొంది గనుక దానికీ మతతత్వ బురద పూసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఇంతవరకు మైనార్టీలు తెదేపా వల్ల మతపరంగా ఎన్నడూ వివక్షకు గురి అయిన దాఖలాలు లేవు. తెదేపా హయాంలో కొన్ని కులాలకు అధిక ప్రాధాన్యం దక్కిందేమో కానీ, మతపరంగా ఎన్నడూ వివక్ష చూపడం లేదా ప్రాధాన్యత ఇవ్వడం గానీ జరుగలేదు. ఇప్పుడు అవసరార్ధం బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నంత మాత్రాన్న తెదేపా తన సెక్యులర్ విధానాలకు స్వస్తి చెపుతుందని అనుకోవడం అవివేకం. దేశంలో మోడీకి పెరుగుతున్న ఆదరణ, విజయావకాశాలు చూసి, బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, దానివలన రాష్ట్రంలో తమ విజయావకాశాలు కూడా మెరుగు పరుచుకోవచ్చనే ఆలోచనతో, ఆశతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలందరికీ అర్ధమయిన ఈవిషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదనుకోలేము. అయినా పనిగట్టుకొని తెదేపాకు కూడా మతతత్వ బురద పూసే ప్రయత్నం ఎందుకు చేస్తోంది అంటే మైనార్టీ ఓట్ల కోసమే. నిజానికి కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రచారంతో అది ముస్లిం, క్రీస్టియన్ ప్రజలను మనుషులుగా కాక కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే భావిస్తోందని అర్ధమవుతోంది. ఎందుకంటే మైనార్టీలకు ఏది సెక్యులర్ పార్టీ? ఏ పార్టీ ఎటువంటిది? అని ఆలోచించే విచక్షణా జ్ఞానం లేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నందునే, ఈవిధంగా ప్రచారం చేసి వారిని తనవైపు తిప్పుకోవచ్చని భావిస్తోంది. తమది సెక్యులర్ పార్టీ అనిచేప్పుకొనే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పట్ల ఎంత చులకన భావం ఉందో ఇది పట్టి చూపుతోంది.
http://www.teluguone.com/news/content/congress-37-33167.html





