కాంగ్రెస్, వై.కాంగ్రెస్ రాజధాని భూసేకరణ వ్యతిరేఖ కమిటీలు
Publish Date:Nov 6, 2014
Advertisement
రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే రెండు, మూడు కమిటీలు వేసింది. విజయవాడలో రాజధాని నిర్మాణాన్ని స్వాగతించిన కాంగ్రెస్, వైకాపాలు ఇప్పుడు ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకొంటోందని ఆరోపిస్తూ ప్రభుత్వంతో పోరాడేందుకు చెరో కమిటీ ఏర్పాటు చేసుకొన్నాయి. ఇంతవరకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రమే చూసిన ప్రజలకి ఇప్పుడు అధికార కమిటీ, ప్రతిపక్ష కమిటీలను కూడా చూసే భాగ్యం కలుగుతోంది. అధికార కమిటీ రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి రాజధాని నిర్మాణం కోసం వారి భూములు తీసుకొనేందుకు కృషి చేస్తుంటే, ప్రతిపక్ష కమిటీలు అధికార పార్టీ ప్రయత్నాలను విఫలం చేయడానికి కృషి చేస్తాయి. అధికార పార్టీ నేతలు రైతుల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు కనుకనే తాము రైతుల తరపున నిలబడి ప్రభుత్వంతో పోరాడవలసి వస్తోందని చెప్పుకొంటున్నారు. ప్రభుత్వం తూళ్ళూరు మండలం కేంద్రంగా రాజధాని నిర్మాణం తలబెట్టినట్లు తెలియగానే ఆ మండలంలో ఇంతవరకు మూడు గ్రామ సభలు జరిగినట్లు సమాచారం. అందులో కొన్ని గ్రామాలు తప్ప చాలా గ్రామాలలో రైతులు ప్రభుత్వం తమ డిమాండ్లన్నిటికీ ఒప్పుకొన్నట్లయితే తాము సంతోషంగా తమ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసారు. వారు మరో సంగతి కూడా చెప్పారు. ఈ వ్యవహారంపై గ్రామాలలో అప్పుడే రాజకీయాలు కూడా మొదలయ్యాయని తెలిపారు. బహుశః అది ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రయత్నాలను ఉద్దేశించి అన్నమాటలే అయ్యి ఉండవచ్చును. ప్రభుత్వం రైతుల దగ్గర నుండి దౌర్జన్యంగా భూములు గుంజుకొనే ప్రయత్నం చేస్తే, దాని వలన తనకే కొత్త సమస్యలు, అప్రతిష్ట తప్పదని ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే, రాజధానిని వేరొక చోటికి తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు. అటువంటప్పుడు అధికార పార్టీ రైతులపై ఎందుకు దౌర్జన్యం చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు కమిటీలు వేసుకొన్నాయంటే, సున్నితమయిన ఈ అంశం నుండి కూడా రాజకీయ మైలేజి పొందాలనే తాపత్రయమే తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును. ప్రభుత్వం తమ షరతులు, డిమాండ్లకు అంగీకరిస్తే తాము భూములు అప్పగించేందుకు సిద్దంగా ఉన్నామని అనేక గ్రామాలలో రైతులు స్వయంగా చెపుతున్నప్పుడు, వైకాపా మాత్రం చాలా హడావుడిగా ఒక కమిటీ వేసేసుకోవడం విశేషం. రైతులు తమ జీవనాధారమయిన భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటే నిశబ్దంగా ఉంటారని ఎవరూ అనుకోనవసరం లేదు. వారు తమకు అన్యాయం జరిగిందని నిరసన కార్యక్రమాలు మొదలుపెడితే కాంగ్రెస్, వైకాపాలు వెళ్లి వారికి అండగా నిలబడితే అందరూ హర్శిస్తారు. కానీ వారికి లేనిపోనివి చెప్పి భయాందోళనలకు గురిచేసి, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉసిగొల్పాలనుకొంటే దానివలన చివరికి వారే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. అయినా ప్రతీ అంశంపై రాజకీయ మైలేజి పొందాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు ప్రజల చేతిలో భంగపడక తప్పదని వారు గ్రహించాలి.వారు గ్రహించాల్సిన ముఖ్యమయిన విషయం మరొకటి కూడా ఉంది. ఈవిధంగా రాజధాని నిర్మాణానికి అడ్డంపడుతుండటం రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారనే సంగతి గుర్తుంచుకోవడం మంచిది.
http://www.teluguone.com/news/content/congres-45-39955.html





