వెయ్యి కోట్ల రూపాయల విలువైన కొకైన్ స్వాధీనం
Publish Date:May 27, 2026
Advertisement
భారతదేశ పశ్చిమ సముద్ర తీరప్రాంతంలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. దేశ భద్రతా సంస్థల అప్రమత్తతతో గుజరాత్‌లోని కచ్ తీరంలో అత్యంత భారీ ఎత్తున సాగిన మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్ విజయవంతమైంది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), భారత కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, దాదాపువెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన కొకైన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన రక్షణ దళాలు సముద్రం మధ్యలోనే స్మగ్లర్ల వ్యూహాలను చిత్తు చేశాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 100 కిలోలకు పైగా స్వచ్ఛమైన కొకైన్‌ను స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిషేధిత మాదకద్రవ్యాలు విదేశాల నుంచి సముద్ర మార్గంలో దేశ రాజధాని ఢిల్లీకి తరలించేందుకు స్మగ్లర్లు వ్యూహం పన్నినట్లు అధికారులు గుర్తించారు. పాకిస్తాన్‌లోని పోర్ట్ ఖాసిం నుంచి బయలుదేరిన ఒక యూరోపియన్ నౌక (ఎంఎస్సీ జహాజ్) కచ్ తీరానికి సమీపంలోకి రాగానే, అక్కడ అనుమానాస్పద కదలికలు జరుగుతున్నట్లు గుజరాత్ ఏటీఎస్, కోస్ట్‌గార్డ్ అధికారులు పసిగట్టారు. భద్రతా దళాల బోట్లు తమ వైపు వేగంగా దూసుకురావడాన్ని గమనించిన స్మగ్లర్లు, పట్టుబడతామనే భయంతో డ్రగ్స్ సంచులను సముద్రంలోకి విసిరేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే సముద్రంలో తేలుతున్న ఆ సంచులను అత్యంత సాహసోపేతంగా వెలికితీసిన అధికారులు.. వాటిని క్షుణ్ణంగా పరీక్షించారు. ఈ తనిఖీల్లో ఒక్కో క్యాప్సూల్‌లో 1.04 కేజీల చొప్పున ప్యాక్ చేసిన మొత్తం 84 డ్రగ్ క్యాప్సూల్స్ లభ్యమయ్యాయి. మొత్తం కొకైన్ బరువు దాదాపు 118 కిలోలుగా తేలింది. ఈ భారీ రవాణా వెనుక బ్రెజిల్ నుంచి సుమారు ఆరు నెలల క్రితమే లోడ్ అయిన అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ లింకులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బ్రెజిల్ నుండి కరాచీ మీదుగా భారత జలాల్లోకి ఈ డ్రగ్స్ ప్రవేశించాయని అధికారులు నిర్ధారించారు. ఈ మెగా ఆపరేషన్ సందర్భంగా నౌక నుంచి అంతర్జాతీయ స్మగ్లర్ జుమా నాసిర్ ఒమార్‌ను అధికారులు అదుపులోకి తీసుకోగా, మరొక నిందితుడు సముద్రంలోకి దూకి పరారయ్యాడు. పట్టుబడిన నిందితుడి సమాచారం ఆధారంగా ఢిల్లీలో ఈ కన్సైన్మెంట్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న కెల్విన్ చుక్వుమా, బైరుహంగా జేమ్స్ అనే ఇద్దరు విదేశీయులను సైతం భద్రతా సంస్థలు వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. నిందితుల నుంచి అత్యాధునిక శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాన్ని కూడా సీజ్ చేశారు. ఈ డివైజ్ ఆధారంగా అంతర్జాతీయ మాఫియా ఏ మార్గాల్లో ప్రయాణించిందో, ఎవరెవరితో సంబంధాలు నెరిపిందో విచారించేందుకు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/cocaine-worth-thousand-crores--seized-36-221019.html





