చదువుతోనే ఆత్మగౌరవం.. గుర్తింపు : సీఎం రేవంత్‌రెడ్డి
Publish Date:Aug 14, 2026
Advertisement
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ ముందుగానే..! విద్యతోనే ఆత్మగౌరవం, గుర్తింపు లభిస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫూలే దంపతుల స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇకపై ప్రతి ఏటా ముందుగానే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థుల ఖాతాల్లోనే నిధులు ముందస్తుగా జమ చేస్తామని తెలిపారు. హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ప్రక్షాళన చేసి, ప్రతి ఏటా రూ.2,400 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఒకప్పుడు ఇంజినీరింగ్, వైద్య డిగ్రీలు ఉంటే ఉద్యోగాలు లభించేవని, ప్రస్తుతం కేవలం సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందే పరిస్థితి లేదన్నారు. నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు ఆ తర్వాత విద్యార్థులకు అవసరమైన స్కిల్స్ నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్స్ యూనివర్సిటీ వంటి వేదికలను వినియోగించుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా నర్సింగ్ చదివిన వారికి జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడలు, సాంకేతిక నైపుణ్యాల్లోనూ పోటీ పెరిగిందని సీఎం అన్నారు. 90 శాతానికి పైగా మార్కులు సాధించే విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని, అయితే చదువులోనే కాకుండా క్రీడలు, ఇతర రంగాల్లో ప్రతిభ చూపేవారిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పేద కుటుంబాల్లో ఎన్నో ప్రతిభావంతులు ఉన్నారని, వారిని గుర్తించి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో ప్రతిభ చూపే వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కోటి రూపాయల వరకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్, దీప్తి శర్మ వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశానికి గౌరవం తీసుకురావాలని కోరారు. చదువుతోనే జీవితాలు, తలరాతలు మారుతాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలమని తెలిపారు. గతంలో కంప్యూటర్ సైన్స్ చదివితే అమెరికాలో ఉద్యోగం లభించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సాంకేతిక విప్లవం కారణంగా పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ రంగాల్లోని ఉద్యోగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యా వ్యవస్థను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాల మధ్య అంతరాలను తగ్గించేందుకు అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట కలిసి చదువుకునే, కలిసి జీవించే విధానాన్ని తీసుకురావడమే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాల నిర్వహణ కోసం కాదన్నారు. వారు చేసిన త్యాగాలు, సమాజానికి అందించిన సేవలను నేటి తరానికి పరిచయం చేసి, వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొందేలా చేయడమే లక్ష్యమని చెప్పారు. మహనీయుల స్ఫూర్తితో విద్యలో రాణించడంతో పాటు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. CM Revanth Reddy, Telangana Government, Education, Students, Fee Reimbursement, Fee Reimbursement Funds, Scholarship, Skill Development, Technical Skills, Skill University, Young India, Young India Sports
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-228960.html





