ఆయన సీమాంధ్ర పక్షపాతిట! నిజమేనా
Publish Date:Oct 23, 2013
Advertisement
‘రాష్ట్ర విభజన జరిగితే కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రజలే కాక తెలంగాణా ప్రజలు కూడా తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కొంటారు, గనుకనే ప్రజలందరి సంక్షేమం కోరి రాష్ట్రం విడిపోకూడదని చెపుతున్నాను’ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదిస్తున్నసంగతి అందరికీ తెలిసిందే. అయితే యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన ఆయన కేవలం సీమాంద్రా ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెరాస నేతలతో బాటు ఆయన స్వంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు గమనించాల్సి ఉంది. ఒకటి ముఖ్యమంత్రి తెలంగాణాతో సహా యావత్ రాష్ట్ర ప్రజలకి నీటి సమస్యలు రాకూడదని కోరుకొంటున్నారు. రెండవది ఆయన సీమాంధ్ర ప్రాంత పక్షపాతి. ఈ రెండు విషయాలు నిర్ద్వందంగా ఋజువు అయినట్లే అనుకోవచ్చును. ఇక విషయంలోకి వస్తే, ఆయన ఒకవైపు యావత్ ప్రజల సంక్షేమం కోరుకొంటున్నానని చెపుతూనే మరో వైపు నెల్లూరు జిల్లాలో గల కండలేరు ప్రాజెక్టు నుండి తను ప్రాతినిధ్యం వహిస్తున్నచిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గానికి త్రాగునీరు తరలించేందుకు రూ.7390 కోట్లు మంజూరు చేసారు. అది కూడా ఆయన త్వరలో తన పదవికి రాజీనామా చేసి కొత్త రాజకీయ పార్టీ పెడతారని జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న ఈ సమయంలో (అక్టోబర్ 4న) జీవో సంతకం చేయడం విశేషం. కండలేరు ప్రాజెక్టుపై నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలు త్రాగు,సాగు నీరుకోసం ఆధారపడి ఉన్నాయి. వీటితో బాటు తెలుగు గంగ పధకం ద్వారా చెన్నైనగరానికి 15 టీయంసీ (యఫ్టీ) నీళ్ళు ఇవ్వవలసి ఉండగా నీళ్ళు లేని కారణంగా కేవలం 5 టీయంసీ (యఫ్టీ)లను మాత్రమే అందించ గలుగుతున్నాము. మూడు జిల్లాలతో బాటు చెన్నై నగరం కూడా కండలేరు ప్రాజెక్టుపైనే ఆధారాపడి ఉన్నాయి. అయినప్పటికీ వాటికి తీవ్ర నీటి ఎద్దడి తప్పడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కండలేరు నుండి తన స్వంత జిల్లా చిత్తూరుకి నీరు తరలించుకుపోవడం చాలా అనైతికమవుతుంది. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో బాధలుపడుతున్నఈ మూడు జిల్లాల ప్రజలు, ఈ ప్రాజెక్టు దెబ్బకి పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీరుకి కూడా నోచుకోకపోవచ్చును. మూడేళ్ళలో పూర్తిచేయాలనే లక్ష్యంతో మొదటి దశ పనులు ఆరంభించడానికి ముఖ్యమంత్రి అక్టోబర్ 4న అనుమతి కూడా మంజూరు చేసారు. ఈ ప్రాజెక్టులో మొదటి దశ పనుల కోసం రూ.5990 కోట్లు కేటాయింపబడ్డాయి. ప్రజలందరి సంక్షేమం కోరుతున్నాని చెప్పుకొనే ముఖ్యమంత్రి తన స్వంత జిల్లాకి, నియోజక వర్గానికే ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? కేవలం సీమాంద్రాకే ముఖ్యమంత్రి అనిపించుకొన్న ఆయన ఇప్పుడు తన పరిధిని మరికొంత కుచించుకొని కేవలం చిత్తూరుకే ముఖ్యమంత్రిగా వ్యవహరించడం ఎంతవరకు సబబు? ఆయన కేవలం తన జిల్లాను మాత్రమే దృష్టిలో ఉంచుకొని మూడు జిల్లాలకు ఈవిధంగా అన్యాయం చేస్తే, ఆ మూడు జిల్లాల ప్రజలకు ఆయన ఏమని సమాధానం చెపుతారు? ఇప్పటికే నీళ్ళు లేక అల్లాడుతున్న కందలేరుపై మరో కొత్త ప్రాజెక్టుకి అన్నివేళ కోట్ల రూపాయలతో మరో కొత్త ప్రాజెక్టు ఇంత హడావుడిగా ఎందుకు ఆమోదించవలసి వచ్చింది? ఒకవేళ ఆయన తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకొన్నపటికీ, దీనివల్ల ఆయన ఆశించిన ప్రయోజనము నెరవేరుతుందా? ఇంత కాలం ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టి ఇకనేడో రేపో దిగిపోయే సమయంలో ఇటువంటి వివాదస్పద నిర్ణయాలు తీసుకొన్నంత మాత్రాన్నవాటిని ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలు ఆమోదించే అవకాశం ఉంటుందా? ప్రజాప్రతినిధులుగా ఎన్నికయి అధికారం చేప్పటిన వారు, ప్రభుత్వానికి, ప్రజల సొమ్ముకి ధర్మకర్తల వలే వ్యవహరించాలి తప్ప అధికారం చేతిలో ఉంది గనుక దానిని దుర్వినియోగం చేస్తే, వారు కొత్తపార్టీలు పెట్టుకొని వచ్చినపటికీ కూడా అటువంటి వారికి ప్రజలు తప్పకుండా శలవు ప్రకటిస్తారు.
http://www.teluguone.com/news/content/cm-kiran-37-26768.html





