కుప్పం నుంచి రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ : సీఎం చంద్రబాబు
Publish Date:Jul 5, 2026
Advertisement
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రాని స్థాయిలో పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లో కనెక్టివిటీని పెంచుతున్నామని చెప్పారు. త్వరలో ప్రజలు అభివృద్ధి చెందిన కుప్పాన్ని చూడబోతున్నారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని ఇదే తరహాలో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇంధన రంగంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తితో పాటు అత్యాధునిక విద్యుత్ సరఫరా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ ఉక్కు సంస్థలు ఆర్సెలార్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పచ్చదనానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంటే కొందరు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. గత పాలకులు కంపెనీలకు భూములు ఇచ్చి వివాదాల్లోకి నెట్టారని, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలువైన భూములు, ఖనిజ సంపద వినియోగం నిలిచిపోయిందని ఆరోపించారు. ఓబుళాపురం, ఆన్‌రాక్ ప్రాజెక్టులు కూడా ఇలాంటి పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాయని అన్నారు. కంపెనీలను తరిమేయడం, పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేయడమే వైసీపీ నాయకుల విధానమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయని, వాస్తవాలు లేకపోయినా అసత్య ప్రచారం కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగుకు కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా "డ్రగ్ ఫ్రీ ఇండియా" ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తుచేశారు. తిరుమల ప్రసాదం కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు రాజకీయ నేతలు సామాజిక మాధ్యమాలకు నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. తనపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయించేందుకు కొన్ని సోషల్ మీడియా వేదికలకు ఫండింగ్ ఇస్తున్నారని అన్నారు. హింస, బూతులు, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడమే ప్రతిపక్షాల విధానమని విమర్శించిన సీఎం, హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకువచ్చామని, త్వరలో గాలేరు-నగరి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-225119.html





