తమిళనాడు ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు
Publish Date:Apr 19, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ, ఆయన సోమవారం నుంచి రెండు రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రబాబు పర్యటన ప్రధానంగా తమిళనాడులోని కీలక ప్రాంతాలైన కోయంబత్తూరు, హోసూర్, చెన్నై, మధురై, మరియు సాత్తూరుల చుట్టూ తిరగనుంది. సోమవారం మధ్యాహ్నం కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభతో ఆయన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తద్వారా స్థానిక ఎన్డీయే కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం హోసూర్, తాలి నియోజకవర్గాల్లో నిర్వహించే ర్యాలీలలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం సాయంత్రం చెన్నైలోని ఆవడిలో భారీ రోడ్‌షో నిర్వహించడం ద్వారా ఓటర్లను నేరుగా కలుసుకునేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పర్యటన ద్వారా ఎన్డీయే కూటమి శ్రేణులతో సఖ్యత పెంచుకోవాలని పార్టీ భావిస్తోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా మధురై, సాత్తూరులలో స్థానిక నేతలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఎన్డీయే చేపడుతున్న అభివృద్ధి అజెండాను ఓటర్లకు వివరించడమే కాకుండా, పరిపాలనలో సాంకేతికత ప్రాముఖ్యతపై తనదైన ముద్రను వేయనున్నారు. దార్శనిక నేతగా గుర్తింపు ఉన్న చంద్రబాబు, తమిళనాడు భవిష్యత్తుకు ఎన్డీయే కూటమి ఎలా దోహదపడుతుందో వివరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 21తో ప్రచారపర్వం ముగియనుండటంతో, చివరి దశలో చంద్రబాబు వంటి సీనియర్ నేత రాక ఎన్డీయే అభ్యర్థులకు ఏ మేరకు బలాన్ని చేకూరుస్తుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, చంద్రబాబు పర్యటన కూటమి ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంలో కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటన అనంతరం ఓటర్ల నాడి ఏ విధంగా మారుతుందో తెలియాలంటే మే 4న వచ్చే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-217735.html





