ఈ అనుకోని అతిథులేంట్రా దేవుడా!
Publish Date:Nov 6, 2015
Advertisement
మన దేశానికి అనుకోని అతిథులు ఎక్కువైపోతున్నారు. మొన్నటి వరకూ కసబ్ అనే అనుకోని అతిథిని జైల్లో కూర్చోపెట్టి మేపడానికి మన ప్రజల సొమ్ము ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టారో గుర్తుండే వుంటుంది. అలాంటి ఖరీదైన క్రిమినల్ అతిథులు రెస్టు తీసుకోవడానికి మన దేశం అన్ని విధాలుగా అనుకూలంగా వున్నట్టుంది. ఇప్పటికీ మన జైళ్ళలో కసబ్ లాంటి ఖరీదైన అతిథులు చాలామంది హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కోర్టుల్లో ఇప్పుడప్పుడే తేలని కేసుల పుణ్యమా అని సదరు అతిథులు ఎంత ఘోరమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ మన జైళ్ళలో మహారాజ భోగాలను అనుభవిస్తున్నారు. అలా రెస్టు తీసుకోవడానికి మరో మహారాజు ఛోటా రాజన్ ఇండియాకి వచ్చాడు.
ఇండోనేసియాలో అరెస్టైన ఛోటా రాజన్ సకల భద్రతా ఏర్పాట్లతో ఢిల్లీలో దిగాడు. ఇక ఆయన అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం చేసిన నేరాల విచారణ ఎన్ని దశాబ్దాలపాటు జరుగుతుందో ఆ దేవుడికే ఎరుక. అసలు ఇప్పుడు చాలామందికి వచ్చిన సందేహం ఏమంటంటే, అసలు ఛోటారాజన్‌ని ఇండోనేసియా పోలీసులు పట్టుకున్నారా... లేక ఇండియా జైళ్ళలో భద్రతా ఏర్పాట్ల మధ్య రాజభోగాలు అనుభవించవచ్చని ఆయనగారే ఒక పథకం ప్రకారం దొరికిపోయాడా? ఏమో.. క్రిమినల్ బ్రెయిన్ అలా కూడా ఆలోచించి వుండొచ్చు. ఎలాగూ దావూద్ గ్యాంగ్ నుంచి ఆయనకి ప్రాణభయం వుంది. అలాంటి వ్యక్తికి ఇండియా జైళ్ళకు మించిన సేఫ్ ప్లేస్ మరోటి వుంటుందా? పైగా వయసు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ జైళ్ళలో వుండటమే మంచిదని భావించి దొరికిపోయాడేమో!
ఛోటారాజన్ ఢిల్లీకి వచ్చీ రావడంతోనే దావూద్ ఇబ్రహీం మీద పగ తీర్చుకుంటానని, అతని అంతు చూస్తానని స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. భారతదేశానికి ప్రధాన శత్రువైన దావూద్ ఇబ్రహీం శత్రువు అంటే మనకి, మన రాజకీయ నాయకులకి మిత్రుడే కదా. మన జైళ్ళలో శత్రువులకే రాజభోగాలు అందుతాయి. మరి మన మిత్రుడికి ఎలాంటి భోగాలు అందనున్నాయో ఊహించుకోవచ్చు. దావూద్ గుట్టుమట్లు తెలుసుకోవాలంటే ఛోటా రాజన్‌ని జైల్లో మర్యాదలకు ఎంతమాత్రం లోటు రాకూడదు. ఏం చేస్తాం...
http://www.teluguone.com/news/content/chota-rajan-arrest-45-52090.html





