అంధ రచయిత్రి రాసిన నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్
Publish Date:Jan 16, 2026
Advertisement
మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో కుటుంబంతో సహా సాయిజ్యోతి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అంధురాలైన సాయిజ్యోతి మొబైల్ లో వాయిస్ ఇన్ పుట్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రచనలు చేస్తున్నారు. ‘చైత్రశ్రీ’ కలం పేరుతో కవితాంజలి అనే కవితా సంపుటితో పాటు ‘మంచుతాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ అనే నవలలు, సామాజిక స్పృహ కలిగించే కథలు రచించారు. నూతక్కి హైస్కూల్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తున్నారు. వైకల్యాన్ని జయించి తన ప్రతిభతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన సాయిజ్యోతిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/chei-veedani-chelimi-noval-36-212618.html





