ఆ ప్రచారంపై నేనేం మాట్లాడను : చంద్రబాబు
Publish Date:Sep 1, 2022
Advertisement
తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరే విషయంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరౌతున్నాయనీ, తెలుగుదేవం ఎన్డీయే గూటికి చేరనుందని వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. దానికి తాను కాదు.. అలా ప్రచారం చేసిన వారే బదులివ్వాలన్నారు. ఈ విషయంపై తాను ఇప్పుడు స్పందించబోనని చంద్రబాబు పేర్కొన్నారు. నాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ నష్టపోయిన దాని కన్నా ఇప్పుడు జగన్ పాలనలోనే ఎక్కువ నష్టపోయిందని ఆయన అన్నారు. తానేం చేసినా, ఎ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. తాను కేంద్ర రాజకీయాలను కూడా ఈ కోణంలోనే చూస్తామని చంద్రబాబు అన్నారు. తాను పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయిందని... రాష్ట్రానికి మంచిపేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా కూడా నష్టపోయామని అన్నారు. సంక్షేమ పథకాలపై టీడీపీ ఎంతో దృష్టిపెట్టిందని... మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎదుర్కోడానికి తెలుగుదేశంతో చెలిమికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో చేరడంపై చంద్రబాబు స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఎన్డీయేలో చేరిక వార్తలను చంద్రబాబు పూర్తిగా ఖండించలేదు.. అలాగని సమర్ధించనూ లేదు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో గత మూడేళ్లుగా జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరిందని చంద్రబాబు అన్నారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పునరుద్ఘటించారు. అందు కోసం ఏమైనా చేస్తామన్నారు. తన సొంత నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ జగన్, ఆయన పార్టీ ప్రచారం చేస్తున్నాయన్నారు. అసలు సంక్షేమం మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అనీ, అటువంటిది తాను సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు నిలిపివేస్తానని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి తనకు రెండు కళ్లు అని చెప్పారు.
http://www.teluguone.com/news/content/chandrababu-says-wount-respond-on-questions-about-joining-nda-25-143065.html





