పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం... జగన్ పై నిప్పులు చెరిగిన బాబు
Publish Date:Dec 18, 2019
Advertisement
ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు భగ్గుమన్నారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై జగన్ ఎలా ప్రకటన చేస్తారంటూ ప్రశ్నించారు. జగన్ చర్యలు పిచ్చి తుగ్లక్‌ను తలపిస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తే జగన్ ఎక్కడ్నుంచి పరిపాలన చేస్తారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు... విశాఖలో ఉంటారా? కర్నూలులో ఉంటారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం నిలదొక్కుకుంటున్నవేళ జగన్ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోతుందన్నారు. ప్రజలు తమ పనుల కోసం అమరావతిలో ఒక ఇల్లు.... కర్నూలులో మరో ఇల్లు కట్టుకోవాలా? అన్నారు. జిల్లాకో ఆఫీస్... మండలానికో కార్యాలయం పెట్టుకోండి ఇంకా బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. సంపదను సృష్టించే ఆదాయ వనరుగా అమరావతికి రూపకల్పన చేశామని చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఆదాయ వనరుగా అమరావతిని డిజైన్ చేశామన్నారు. ప్రతీ తెలుగుబిడ్డ గర్వించే ప్రపంచస్థాయి నగరం రావాలన్నదే అందరి ఆకాంక్షన్న చంద్రబాబు... పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని అమరావతిని నిర్మించాల్సిన అవసరముందన్నారు. అయితే, రాష్ట్ర భవిష్యత్ ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని జగన్ చర్యలపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు సమ్మతం తెలిపారని చంద్రబాబు అన్నారు. 2014 సెప్టెంబర్ 4న అసెంబ్లీ వేదికగా జగన్ తన నిర్ణయం చెప్పారని బాబు గుర్తుచేశారు. విజయవాడలో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు ఆనాడు జగన్ అన్నారని... అలాగే, రాజధాని ప్రాంతంలో కనీసం 30వేల ఎకరాలు ఉండాలని సూచించారని.... ఆనాటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను బాబు చదివి వినిపించారు. కానీ, ఇప్పుడు తనపై కక్షతో అమరావతిని చంపేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
http://www.teluguone.com/news/content/chandrababu-reaction-on-cm-jagan-decision-over-3-capitals-for-ap-39-92316.html





