అర్ధాంగి భువనేశ్వరికి బేరమాడి పట్టు చీర కొన్న చంద్రబాబు
Publish Date:Mar 8, 2025
Advertisement
ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయించడం అరుదుగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తన అర్ధాంగి నారా భువనేశ్వరి గురించి ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటారు. శనివారం (మార్చి 8) ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆమెకు సర్ ప్రైజ్ గిప్ట్ కొనుగోలు చేశారు. తన పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఓ చీరల స్టాల్ ను సందర్శించిన చంద్రబాబు... తన అర్ధాంగి కోసం ఓ పట్టుచీర కొన్నారు. బేరం ఆడి మరీ చీరను కొన్నారు. చీర ఎంతకు అమ్ముతున్నావమ్మా అని స్టాల్ లో ఉన్న మహిళను చంద్రబాబు అడిగారు. రూ.26,400 అని ఆ మహిళ బదులిచ్చింది. ఆ చీరను రూ.25 వేలకు ఇవ్వమని బేరం ఆడి కొన్నారు. వ్యాపారం ఎలా సాగుతుందమ్మా అని ఆప్యాయంగా అడిగారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తన సతీమణి భువనేశ్వరికి స్పెషల్ గిఫ్ట్ తీసుకున్నారు. ఆయన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఎగ్జిబిషన్ స్టాల్ ప్రారంభించిన తర్వాత ప్రతి స్టాల్ దగ్గరకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు.భార్య కోసం స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేశారు. ఆ చీరల ప్రత్యేకత గురించి చంద్రబాబు అప్పట్లో అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత జరిగిన తొలి చేనేత దినోత్సవంలో రెండు చీరలు కొనడం ఆసక్తి కలిగించింది. చంద్రబాబు అరెస్టు సమయం నుంచి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో రాష్ట్రాన్ని చుట్టుముట్టారు. ఆమె తన భర్త చంద్రబాబుకు ప్రజలే తొలి ప్రాధాన్యత అని… కుటుంబం ఆ తరువాతేనని భువనేశ్వరి చెబుతుంటారు.తనకు ఆయన ఓ చీర కొనిచ్చి దాదాపు 30 ఏళ్ళు అయి ఉంటుందని నాడు తెచ్చినప్పుడు కూడా తనకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యిందని... దాన్ని భద్రంగా బీరువాలో దాచుకున్నానని ఆ తర్వాత భువనేశ్వరి సరదాగా చెప్పారు. భువనేశ్వరి వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకునే ఆమెకు ఓ గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే బాబు ఈ చీర కొన్నారని అనుకోవచ్చు.. గతానికి భిన్నంగా చంద్రబాబు ఇటీవలి కాలంలో కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వారితో కొంత సమయం కేటాయిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-buys-saree-after-bargaining-with-ardangi-bhuvaneshwari-25-194095.html





